అలాంటి పిల్లలకు టాలెంట్ ఎక్కువట!

11 Mar, 2016 14:13 IST|Sakshi
అలాంటి పిల్లలకు టాలెంట్ ఎక్కువట!

లండన్: వీడియోగేమ్స్.. పిల్లల వీపు విమానం మోత మోగించేందుకు తల్లిదండ్రులకు ఒక కారణం. అది ఒకప్పుడు. మరి ఇప్పుడు.. 'మొన్నే లేటెస్ట్ మొబైల్ కొన్నా.. మా బుడ్డోడు దాన్ని ఒదిలిపెడితే ఒట్టు. ఎట్లా నేర్చుకున్నాడో గానీ భలే ఆడతాడండీ గేమ్స్..' అని గొప్పలు చెప్పుకోని పేరేంట్స్ లేరంటే అతిశయం కాదు. ఇంతకీ పిల్లలు వీడియోగేమ్స్ ఆడటం మంచిదా? కాదా? అంటే..

నూటికి నూరుపాళ్లు మంచిదేనంటున్నారు పరిశోధకులు. కొలంబియా యూనివర్సిటీలోని మాలిమన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కు చెందిన పరిశోధకులు భారీ అధ్యయనం చేసి మరీ ఈ విషయాన్ని రుజువు చేశారు. వివిధ దేశాల్లోని 6  నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారుల మెంటల్ హెల్త్ కండీషన్ ను అధ్యయనం చేసిన తర్వాతే ఈ నిర్ధారణకు వచ్చినట్టు పరిశోధకులు చెబుతున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి వివరాలు తీసుకోవడంతో పాటు తాము అడిగిన ప్రశ్నలకు పిల్లలు చెప్పిన సమాధానాల ఆధారంగా ఓ డేటా రూపొందించి..దానిపై సమగ్రంగా విశ్లేషించినట్టు పరిశోధకులు తెలిపారు.  

సాధారణ పిల్లలతో పోలిస్తే వీడియోగేమ్స్ ఆడే పిల్లల్లో మేధో శక్తి 1.75 రెట్లు అధికంగా ఉందని నిర్ధారించారు. వీడియో గేమ్స్ ఆడే పిల్లలు చదువుల్లోనూ 1.88 రెట్లు ఎక్కువ ప్రతిభ కనబరుస్తున్నారని, తద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్, హెల్దీ రిలేషన్స్ డెవలప్ అవుతాయని అధ్యయనం నిర్వహించిన ప్రొఫెసర్ కేథరీన్ ఎం కీయెస్ పేర్కొన్నారు. అయితే వీడియో గేమ్స్ అధికంగా ఆడటం వల్ల చిన్నారుల్లోని నైపుణ్యంపై ప్రభావం పడుతుందనే ఆందోళనతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే తమ అధ్యయనంలో ఇందుకు విరుద్దుమైన ఫలితాలు వచ్చాయంటున్నారు కేథరీన్. అంతేకాకుండా  అందరూ అనుకున్నట్లు వీడియోగేమ్స్ ఆడటానికి, చిన్నారుల మానసిక రుగ్మతలకు మధ్య ఎలాంటి సంబంధం లేదని, అయితే అదే పనిగా వీడియోగేమ్స్ స్క్రీన్లకు అతుక్కుని పోకుండా పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ అధ్యయన ఫలితాలు ఉంటాయని కీయోస్ సలహా ఇస్తున్నారు.

మరిన్ని వార్తలు