టబ్స్‌ నుంచి టాయిలెట్ల వరకూ బంగారమే!

3 Jul, 2020 16:07 IST|Sakshi

పర్యాటకులకు కనువిందుగా పసిడి హోటల్‌

హనోయి : వెంటాడుతున్న మహమ్మారి.. ఆపై కఠిన ఆంక్షలు వీటన్నింటి మధ్య కస్టమర్లను ఆకర్షించేందుకు వ్యాపార సంస్థలు వినూత్న పోకడలతో ముందుకొస్తున్నాయి. కస్టమర్‌ దేవుళ్లను ఆకట్టుకునేందుకు మరికొందరు ఎంతటి ఖర్చుకైనా వెనుకాడటం లేదు. సుదీర్ఘ లాక్‌డౌన్‌ అనంతరం వియత్నాం రాజధాని హనోయిలో ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ సకల హంగులతో పునఃప్రారంభమైంది. అతిథులు, పర్యాటకులను ఆకర్షించేందుకు డాల్స్‌ హనోయి గోల్డెన్‌ లేక్‌ హోటల్‌ నిర్వాహకులు బాత్‌టబ్‌ల నుంచి బేసిన్‌ల వరకూ చివరికి టాయిలెట్లనూ బంగారు పూతతో పసిడిమయం చేశారు.

హోటల్‌లో ఎటువైపు చూసినా స్వర్ణకాంతులు మెరిసేలా ఏర్పాట్లు చేశారు. మూడు నెలల లాక్‌డౌన్‌ అనంతరం వియత్నాంలో ఇప్పుడిప్పుడే పర్యాటకుల రాక మొదలవడంతో వారిని ఆకట్టుకునేందుకు ఈ హోటల్‌ అదనపు హంగులతో ముందుకొచ్చింది. సోవియట్‌ నాటి భవనాల పక్కన హు బిన్‌ గ్రూపుకు చెందిన ఈ హోటల్‌ను ప్రత్యేకంగా కనిపించేలా వన్నెలద్దారు. ప్రస్తుతం ప్రపంచంలోనే ఇలాంటి హోటల్‌ మరెక్కడా లేదని హు బిన్‌ గ్రూప్‌ చీఫ్‌, హోటల్‌అధిపతి నుయెన్‌ హు దుంగ్‌ చెప్పారు.

ఎల్లో మెటల్‌ పూల్‌
హోటల్‌ పైకప్పుపై 24 కేరట్ల బంగారు పూతతో స్విమ్మింగ్‌పూల్‌ ప్రధాన ఆకర్షణ కాగా, అతిథుల రూంలు, బాత్‌రూమ్‌ గోడలు బాత్‌టబ్స్‌కూ బంగారు పూత ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. సిటీలోని ఇతర హోటల్స్‌ తరహాలోనే ఈ హోటల్‌లోనూ ఒక రాత్రికి 18,176 రూపాయలు వసూలు చేస్తారు. ఈ ఏర్పాట్లతో అతిథులు సైతం ఆశ్చర్యపోతున్నారు. లగ్జరీ అంటే ఏంటో ఈ హోటల్‌ తిరగరాసిందని, ఇతర లగ్జరీ హోటళ్లు సహజంగా టైల్స్‌కు మార్బుల్స్‌ను వాడుతుంటే ఈ హోటల్‌లో వాషింగ్‌ బేసిన్‌తో సహా అన్నీ బంగారుపూతతో మెరిసిపోతున్నాయని 62 ఏళ్ల ఓ అతిథి వాన్‌ తున్‌ అన్నారు. వాన్‌ కూడా ఓ హోటల్‌ అధినేత కావడం కొసమెరుపు.

టన్ను బంగారంతో తళుకులు
హోటల్‌ మొత్తం బంగారుపూత కోసం టన్ను బంగారాన్ని వాడామని హోటల్‌ అధిపతి హు దుంగ్ అన్నారు. వియత్నాం యుద్ధంలో పాల్గొన్న దుంగ్‌ ఆపై ట్యాక్సీ డ్రైవర్‌గానూ పనిచేశారు. నిర్మాణ, రియల్‌ఎస్టేట్‌ రంగంలో భారీగా సంపాదించిన దుంగ్‌ ఆతిథ్య రంగంలోనూ అదృష్టం పరీక్షించుకున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించకుంటే ఈ హోటల్‌ మొత్తం అంతర్జాతీయ అతిథులతో నిండిపోయేదని ఆయన చెప్పుకొచ్చారు. చదవండి : లాక్‌డౌన్‌; ఆగిన బతుకు బండి

మరిన్ని వార్తలు