మాల్యా అప్పీల్‌పై విచారణకు హైకోర్టు ఓకే

3 Jul, 2019 03:45 IST|Sakshi
విజయ్‌ మాల్యా

లండన్‌: బ్యాంకులకు రూ.9వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్‌ మాల్యాకు బ్రిటన్‌ హైకోర్టులో ఊరట లభించింది. మాల్యాను భారత్‌కు అప్పగించే నిర్ణయం తీసుకుంటూ గతంలో బ్రిటన్‌ హోం శాఖ ఇచ్చిన ఉత్తర్వులపై మాల్యా చేసుకున్న అప్పీల్‌ను విచారించేందుకు హైకోర్టు అంగీకారం తెలిపింది. మాల్యా అప్పీల్‌ను విచారణకు స్వీకరించాలా, వద్దా అన్న విషయంపై జస్టిస్‌ జార్జ్‌ లెగ్గాట్ట్, జస్టిస్‌ ఆండ్రూ పాపుల్‌వెల్‌ల ద్విసభ్య ధర్మాసనం మంగళవారం ఇరుపక్షాల వాదనలు విన్నది. అనంతరం తాము అప్పీల్‌ను విచారణకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. మాల్యా తరఫున న్యాయవాది క్లారీ మోంట్‌గోమెరీ వాదనలు వినిపించగా, భారత హై కమిషన్‌ కార్యాలయ అధికారులు, మాల్యా భాగస్వామి పింకీ లల్వానీ, కొడుకు సిద్ధార్థ్‌లు కూడా కోర్టుకు వచ్చారు.

మాల్యా అప్పీల్‌ పిటిషన్‌ను కోర్టు తదుపరి రోజుల్లో విచారించనుంది. కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కోసం అప్పు తీసుకుని, బ్యాంకులకు దాదాపు 9 వేల కోట్ల రుణాన్ని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మాల్యాను బ్రిటన్‌ పోలీసులు 2017 ఏప్రిల్‌లోనే అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి ఆయన అక్కడే బెయిల్‌పై ఉంటున్నారు. అప్పటి నుంచి మాల్యాను భారత్‌కు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగానే మాల్యా రుణాలను ఎగ్గొట్టారనడానికి ఆధారాలు ఉన్నాయని గతేడాది డిసెంబర్‌లోనే లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు తేల్చింది. దీంతో మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్‌ హోం శాఖ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు