హమ్మయ్య.. చావు అంచులదాకా వెళ్లి...

6 Nov, 2019 20:42 IST|Sakshi

ఇటీవల ఏనుగులు అనేక ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఏనుగులకు కోపం వస్తే ఎంతటి దారుణానికి అయినా వెనుకాడవు. దానికి మరో ఉదాహారణే ఈ ఘటన. ఓ వ్యక్తి  ఏనుగు వల్ల  చావు చివరి అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డాడు. పార్కులో ఉన్న గజరాజుకు ఏం కోపం వచ్చిందో ఏమో ఏకంగా రోడ్డు మీద ప్రయాణిస్తున్న కారుపై దాడి చేసి.. ధ్వంసం చేయాలని చూసింది. థాయ్‌లాండ్‌లోని ఖోయోయాయి జాతీయ పార్కులో ఉన్న 35 ఏళ్ల ఏనుగు పార్కు నుంచి రోడ్డువైపు వస్తుండగా.. రోడ్డు మీద వెళుతున్న కారు దానికి అడ్డం వచ్చింది. ఏనుగును గమనించిన కారు డ్రైవర్‌.. వాహనాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ, కారును చూడటంతోనే ఏనుగుకు ఒక్కసారి కోపం వచ్చినట్టుంది. వెంటనే కారుపైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తూ.. అద్దాలను, పైకప్పును ధ్వంసం చేసింది. దీంతో అప్రమత్తమైన కారులోని వ్యక్తి బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పట్టుకొని..కారును వేగంగా ముందుకు నడిపి ఏనుగు బారినుంచి తప్పించుకున్నాడు.

అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే ప్రమాద సమయంలో కారులో ఎంతమంది ఉన్నారనే విషయంపై క్లారిటీ రాలేదు. ఈ వీడియోను నిల్‌తారాక్‌ అనే వ్యక్తి తన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేయగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన నేపథ్యంలో సదరు పార్కు పర్యాటకుల కార్లను ఏనుగుల నుంచి 30 మీటర్ల దూరంలో పార్క్‌ చేయాలని సూచించింది. ఇదే పార్కులో ఇటీవల ఆరు ఏనుగులు జలపాతంపై నుంచి జారిపడి మృత్యువాతపడ్డాయి. 

మరిన్ని వార్తలు