దొంగలు కావలెను!

16 Dec, 2018 02:00 IST|Sakshi

ప్రముఖ బట్టల దుకాణంలో పనిచేసేందుకు దొంగలు కావలెను. మా స్టోర్‌లో దొంగతనం చేసేందుకు అనుభవం, ఆసక్తికల వారు దరఖాస్తు చేసుకోగలరు. జీతం గంటకు రూ.5 వేలు.అంతా బాగానే ఉంది కానీ సేల్స్‌మెన్‌ అని ఉండాల్సిన చోట దొంగలు అని తప్పుగా రాశారే.. అనుకుంటున్నారా...? తప్పుగా ఏమీ రాయలేదు. ఆ దుకాణంలో నిజంగా దొంగలే కావాలట. అది కూడా ప్రొఫెషనల్‌ దొంగలు. అదేంటి ఏరి కోరి దొంగలను నియమించుకోవడం ఏంటి.. పైగా వారి షాప్‌లోనే దొంగతనం చేయాలా.. ఇదెక్కడి చోద్యం బాబోయ్‌ అని ఆశ్చర్యపోతున్నారా..? దీని వెనుక కూడా అర్థం, పరమార్థం ఉందండోయ్‌! అసలు విషయంలోకి వస్తే.. బ్రిటన్‌లోని ఓ మహిళ బార్క్‌.కామ్‌ అనే జాబ్‌ వెబ్‌సైట్‌లో ఈ ప్రకటన పెట్టారు. తన దుకాణంలో దొంగతనం చేసి, ఎలా దొంగతనం చేశారో తనకు వివరించాలని అందులో పేర్కొన్నారు. దీంతో తన దుకాణంలో దొంగతనాలను అరికట్టొచ్చని ఆమె భావిస్తున్నారు. దొంగతనం చేసిన వారికి గంటకు రూ.5 వేలతో పాటు దొంగిలించిన మూడు వస్తువులు తమ వెంటే ఉంచుకోవచ్చని ఆఫర్‌ ఇచ్చారు కూడా. 2013లో ప్రారంభించిన తన దుకాణంలో ప్రతి క్రిస్‌మస్‌కు భారీగా దొంగతనాలు జరుగుతున్నాయని, వాటిని ఆపేందుకు ఇలా భిన్నంగా ఆలోచించినట్లు తెలిపారు. ఇలా చేస్తే తన దుకాణంలో సెక్యూరిటీ లోపాలను తెలుసుకోవచ్చని వివరించారు. దీంతో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేయొచ్చని ఆమె చెబుతున్నారు. అయితే కాస్త భిన్నంగా ఉన్నా.. ఆమె ఐడియాలో లాజిక్‌ పాయింట్‌ ఉంది కదా..! మంచి పనితనం ఉన్న దొంగ దొరకాలని మనమూ ఆశిద్దాం.

మరిన్ని వార్తలు