‘ప్రపంచంలో మనుషులే భయంకరమైన జంతువులు’

8 Feb, 2020 11:52 IST|Sakshi

గల్లీ రోడ్డైనా, జాతీయ రహదారైనా ఏదైనా సరే రోడ్లపై రయ్‌రయ్‌మంటూ యమస్పీడ్‌తో బండ్లు నడుపుతారు చాలామంది. ఇక ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ దగ్గర నిమిషం కూడా ఓపిక పట్టలేరు. ఇక్కడ చెప్పుకునే వ్యక్తి కూడా ఇలాంటి కోవకే చెందుతాడు. ఓ ప్రాంతంలో అధికారులు కాసేపటి వరకు రోడ్డుపై రాకపోకలను ఆపివేశారు. ఏనుగులు రోడ్డు దాటేందుకు గాను వాళ్లు ఈ చర్యలు చేపట్టారు. అయితే అవి దాటేంతవరకు ఆగలేని ఓ వాహనదారుడు నిర్లగా తన బండిని ముందుకు పోనిచ్చాడు. సరిగ్గా అదే సమయానికి ఓ గున్న ఏనుగు రోడ్డు దాటేందుకు వచ్చింది. తృటిలో దాన్నుంచి తప్పించుకుని బండిని ముందుకు పోనిచ్చి బతుకుజీవుడా అనుకున్నాడు. కానీ, క్షణం ఆలస్యమైనా ఏనుగును ఢీకొట్టి అటు దాని ప్రాణంతోపాటు, అతని ప్రాణాన్ని కూడా ప్రమాదంలోకి నెట్టేవాడే.

దీనికి సంబంధించిన వీడియోను పర్వీన్‌ కస్వాన్‌ అనే అటవీ శాఖ అధికారి శుక్రవారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ‘ఏనుగులు రోడ్డు దాటడం కోసం ఆ రహదారిలో వాహనాలను కాసేపటి వరకు నిషేధించాం. దీనికి వాహనదారులు కూడా సహకరించారు. కానీ అతను మాత్రం అవేవీ పట్టించుకోకుండా ప్రాణాలను రిస్క్‌లో పెట్టాడు. సెకన్‌ ఆలస్యమైనా అతని పని అయిపోయేదే. దయచేసి ఇలాంటివి ఇంకెప్పుడూ చేయకండి’ అని పేర్కొన్నాడు. నెటిజన్లు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ ప్రపంచంలో మనుషులే భయంకరమైన జంతువులు’ అంటూ ఓ నెటిజన్‌ తన కోపాన్ని కామెంట్‌లో ప్రదర్శించాడు. ‘కొన్నిసార్లు జనాలు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తారు, కనీస భద్రత పాటించడం తెలుసుకోండి’ అంటూ మరో నెటిజన్‌ ఘాటుగానే సూచనలు ఇచ్చాడు.

చదవండి: కోవా.. కావాలామ్మా!

మరిన్ని వార్తలు