వైరల్‌: పిల్లికి కుర్చీ అందించిన పెద్దాయన

2 Jan, 2020 14:42 IST|Sakshi

ఎలా వెళ్లిందో ఏమోగానీ ఓ పిల్లి ఎత్తున ఉన్న గోడపై కూర్చుంది. అంతవరకూ బాగానే ఉన్నా దానికి అక్కడి నుంచి కిందికి ఎలా రావాలో అర్థం కాలేదు. ‘మ్యావ్‌.. మ్యావ్‌..’ అంటూ సహాయం కోసం అరవసాగింది. ఇది గమనించిన ఓ పెద్దాయన దాన్ని చూసి జాలిపడి పిల్లిని కిందకు రప్పించేందుకు పథకం రచించాడు. అనుకున్నదే తడవుగా వెంటనే ఓ ప్లాస్టిక్‌ కుర్చీని చేతులోకి తీసుకున్నాడు. దాన్ని పైకెత్తి పట్టుకుని, పిల్లి అందులోకి వచ్చేంతవరకు అలానే పట్టుకుని నిలబడ్డాడు. మొదట పిల్లి కుర్చీలోకి రావాలా వద్దా అని కాసేపు తటపటాయించింది. తర్వాత దానికి ఏమర్థమైందో ఏమో కానీ వెంటనే కుర్చీలోకి దూకి కూర్చుంది. దీంతో ఆ వ్యక్తి కుర్చీని నెమ్మదిగా కిందకు దించాడు. వెంటనే పిల్లి అక్కడ నుంచి చెంగున నేలపైకి దూకి ఆనందంతో సందులోకి పరుగు లంకించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో విస్తృత ఆదరణను సంపాదించుకుంది. ఈ వీడియోను లక్షల మంది వీక్షించగా వేలల్లో లైకులు వచ్చి పడుతున్నాయి. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలు మాత్రం తెలియరాలేదు. కాగా పిల్లిని కాపాడిన వ్యక్తికి నెటిజన్లు పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పిల్లిని కాపాడి ఎంత మంచి పని చేశారని ఆ వ్యక్తిని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.

మరిన్ని వార్తలు