పాప నైపుణ్యానికి నెటిజన్ల ఆశ్చర్యం: వైరల్‌

6 Sep, 2019 09:52 IST|Sakshi

కాన్‌బెర్రా : పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్లు ఆస్ట్రేలియాకు చెందిన ఓ చిన్నారి తన నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సరిగ్గా నడవటం చేతకాని వయసులో స్కేట్‌ బోర్డుమీదకెక్కి పచార్లు చేస్తోంది. మెయిల్‌ ఆన్‌లైన్‌ కథనం ప్రకారం.. ఆస్ట్రేలియాలోని క్లార్క్‌ ఫీల్డ్‌కు చెందిన కోకో హీత్‌ అనే చిన్నారికి ఐదు నెలల వయస్సులో స్కేట్‌ బోర్డు్‌ అంటే ఇష్టం ఏర్పడింది. ఇది గమనించిన పాప తల్లి కెల్లీ చిన్నారిని అంత చిన్న వయస్సునుంచే స్కేట్‌బోర్డు మీద ఉంచి ఆడించేది. ప్రస్తుతం కోకో వయస్సు 14నెలలు. స్కేట్‌ బోర్డుపై కోకోకు పట్టువచ్చిన తర్వాత ఒక్కదాన్నే బోర్డుపై వదిలేసేది. చిన్నారి ఏ మాత్రం భయపడకుండా స్కేట్‌ బోర్డింగ్‌ చేయటం నేర్చుకుంది.

14 నెలల కోకో స్కేట్‌ బోర్డింగ్‌ చేయటం చూసిన చాలా మంది ఆశ్చర్యపోవటమే కాకుండా ఇంత చిన్న వయస్సులో ఎలా చేస్తోందంటూ నోరెళ్లబెడుతున్నారు. అంతేకాకుండా చిన్నారితో సెల్ఫీలు, ఫొటోలు దిగటానికి పోటీ పడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలై నెటిజన్లనుంచి విశేషమైన స్పందన వస్తోంది. ‘‘ షూలకు గమ్‌ అంటించుకుందా ఏంటి?. అద్బుతంగా చేస్తోంది. అంత చిన్న వయస్సులో స్కేట్‌ బోర్డింగ్‌ చేయటం గొప్ప విషయం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు