-

‘నీలా ఎవరూ రిపోర్టింగ్‌ చేయలేరు’

15 Jan, 2020 19:07 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ జర్నలిస్ట్‌ అమిన్‌ హఫీజ్‌ మరోసారి వార్తల్లోకెక్కాడు. గతంలో గేదెను ఇంటర్వ్యూ చేసిన అతను ఇప్పుడు మరో వినూత్న పద్ధతిలో రిపోర్టింగ్‌ చేశాడు. అమిన్‌ హఫీజ్‌ పాకిస్తాన్‌లోని జియో న్యూస్‌ చానల్‌లో ఓ జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. అతను చక్రవర్తి వేషం ధరించి చేతిలో కత్తి, మెడపై కిరీటంతో న్యూస్‌ రిపోర్ట్‌ చేశాడు. అతని వెనకాల ఇద్దరు భటులు నిలబడగా తన చేతిలోని కత్తిని తిప్పుతూ ముఖ్యాంశాలను వివరించాడు. ఈ తతంగాన్ని మరో జర్నలిస్టు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. క్షణాల్లో ఇది వైరల్‌గా మారింది. పైగా అతని వినూత్న రిపోర్టింగ్‌ యధాతథంగా టీవీ బులిటెన్‌లో ప్రత్యక్షమైంది.

దీన్ని వీక్షించిన నెటిజన్లు ‘బాబోయ్‌ ఈ జర్నలిస్ట్‌ మళ్లీ వచ్చేశాడ్రా బాబూ’ అని తలలు పట్టుకుంటూనే ఈ వీడియోలను చూసి సరదాగా నవ్వుకుంటున్నారు. తన వృత్తిలో కొత్తదనం చూపించాలనుకుంటాడో ఏమో కానీ అతను ఎప్పుడూ ఏదో ఒక రకంగా వార్తల్లోకి నిలుస్తూనే ఉంటాడు. గతంలో అతను గేదెలను ఇంటర్వ్యూ చేస్తూ వాటిపై ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆ తర్వాత కూడా అతను మరోసారి విచిత్రంగా వ్యవహరించాడు. ఓ గాడిదపై స్వారీ చేస్తూ అక్కడి ప్రేక్షకులతో సంభాషించాడు. ఇది చూసిన జనాలు ‘పిచ్చి పట్టినట్లుంది, అతన్ని ఎవరికైనా చూపించండ్రా’, ‘నీలా రిపోర్టింగ్‌ ఎవరూ చేయలేరు మహాప్రభో’ అంటూ రకరకాలుగా సెటైర్లు వేశారు.

మరిన్ని వార్తలు