వినోదాత్మక రైడ్‌ కాస్తా భయానకంగా..

4 Dec, 2019 14:40 IST|Sakshi

బ్యాంకాక్‌: ఎగ్జిబిషన్‌కు వెళితే వినోదాన్ని, థ్రిల్‌ను సమంగా పంచే రంగులరాట్నం వంటి వినోదాత్మక రైడ్‌లు పూర్తి చేయకుండా ఎవరూ తిరుగుముఖం పట్టరు. పైగా ఇంకా కొత్తగా ఎలాంటి రైడ్‌లు వచ్చాయో తెలుసుకుని మరీ వాటిని ఓసారి ప్రయత్నిస్తారు. ఆ తర్వాతే వెనుదిరుగుతారు. అదేవిధంగా థాయిలాండ్‌లోని లోప్‌బురిలో జరుగుతున్న ఎగ్జిబిషన్‌కు విచ్చేసిన జనాలు పైరేట్స్‌ ఆఫ్‌ కరేబియన్‌ రైడ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకున్నారు. అనుకున్నదే తడవుగా మెషీన్‌ ఎక్కి కూర్చున్నారు. చిన్నపిల్లలతోపాటు యువకులు కూడా రైడ్‌ ప్రారంభమవుతోందని కేరింతలు కొట్టారు.

అయితే అది తిరుగుతున్న సమయంలోనే పిల్లలు ఒక్కొక్కరిగా సీట్లలోనుంచి కిందపడిపోతూ చెల్లాచెదురు కాసాగారు. కొద్ది సమయంలోనే కేరింతలు కాస్తా అరుపులు కేకలుగా మారాయి. దీంతో అక్కడి జనం ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన నిర్వాహకుడు వెంటనే మెషీన్‌ను నిలిపివేశాడు. ఇక కిందపడినవారిలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. కానీ ఓ బాలుడికి మాత్రం నుదుటిపై దెబ్బ బలంగా తగలడంతో విలపిస్తూ కనిపించాడు. దీంతో చావు తప్పి కన్ను లొట్ట పోయిందన్నుట్టుగా తయారైంది అక్కడి పరిస్థితి.

అతను టాయిలెట్‌కు వెళ్లాడు, అందుకే..
‘నా మిత్రుడు దీన్ని నడిపిస్తాడని, అయితే అతను టాయిలెట్‌కు వెళ్లడంతో నేనే నడిపానని, అందువల్లే ప్రమాదం జరిగింది. ఈ మెషీన్‌ గురించి నాకు ఏమీ తెలియదు. అందుకే ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే నడిపాను. నా పొరపాటు వల్ల ఇబ్బంది పడినందుకు క్షమాపణలు’ అని ఆ సమయంలో మెషీన్‌ ఆపరేట్‌ చేసిన వ్యక్తి చెప్పుకొచ్చాడు. కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు గుర్తించారు. తాత్కాలికంగా రైడ్‌ను నిలిపివేశారు.

మరిన్ని వార్తలు