విటమిన్‌–బీతో గర్భస్రావాలకు చెక్‌?

13 Aug, 2017 02:36 IST|Sakshi
విటమిన్‌–బీతో గర్భస్రావాలకు చెక్‌?

సిడ్నీ: పనిఒత్తిడి, కాలుష్యం వంటి కారణాలతో ఆకస్మిక గర్భస్రావాలు జరుగుతుంటాయి. అయితే గర్భస్రావాలే కాకుండా పుట్టే పిల్లల్లో వచ్చే అనేక లోపాలను అధిగమించేందుకు తగినంత విటమిన్‌ –బీ3 ఎంతో ఉపయోగపడుతుందని ఆస్ట్రేలియాలోని విక్టక్‌ చాంగ్‌ కార్డియాక్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నికొటినమైడ్‌ అడినైన్‌ డైన్యూక్లియోటైడ్‌ (ఎన్‌ఏడీ) అనే మూలకం పిండం అభివృద్ధికి, డీఎన్‌ఏ మరమ్మతులు, కణాల మధ్య సమాచారం అందించేందుకు ఎంతో కీలకమని వీరు ఓ అధ్యయనం ద్వారా గుర్తించారు.

ఈ మూలకం తగినంత లేకపోవడం వల్ల గర్భస్రావాలు జరిగే అవకాశాలు పెరుగుతాయని, పుట్టబోయే బిడ్డ గుండె, వెన్నెముక, మూత్రపిండాల్లో లోపాలు తలెత్తవచ్చని తెలిసింది. కూరగాయల్లో ఎక్కువగా ఉండే నియాసిన్‌ ద్వారా ఎన్‌ఏడీ మూలకం శరీరానికి అందుతుందని, గర్భధారణ సమయంలో తీసుకునే మల్టీ విటమిన్‌ మాత్రల ద్వారా కూడా విటమిన్‌–బీ3 మోతాదు బాగా పెరుగుతున్నట్లు తాము గుర్తించామని శాస్త్రవేత్త సాలీ డున్‌వుడీ తెలిపారు.

ఎలుకల్లో జరిపిన ప్రయోగాల్లో విటమిన్‌–బీ3 మోతాదు తక్కువగా ఉన్నప్పుడు గర్భస్రావాలు ఎక్కువైనట్లు గుర్తించామని, విటమిన్‌ను అందించినప్పుడు గర్భస్రావాలు గణనీయంగా తగ్గాయని సాలీ చెప్పారు. ఈ నేపథ్యంలో శరీరంలోని ఎన్‌ఏడీ మోతాదులను గుర్తించేందుకు, తద్వారా విటమిన్‌–బీ3 వాడకాన్ని నిర్ధారించేందుకు ఓ పరీక్షను సిద్ధం చేస్తున్నామని, ఇది అందుబాటులోకి వస్తే గర్భస్రావాల సంఖ్య తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు