రష్యా పీఠంపై మళ్లీ పుతిన్‌

20 Mar, 2018 03:00 IST|Sakshi
వ్లాదిమిర్‌ పుతిన్‌

అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం

రిగ్గింగ్‌ జరిగిందన్న ప్రతిపక్షాలు

మాస్కో: అమెరికా, బ్రిటన్‌లతో తీవ్రమైన విభేదాలు నెలకొన్న నేపథ్యంలో రష్యన్లు మరోసారి వ్లాదిమిర్‌ పుతిన్‌(65)కే పట్టం కట్టారు. దేశవ్యాప్తంగా ఆదివారం ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌కు 76.67 శాతం ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి కమ్యూనిస్ట్‌ పార్టీ నేత పావెల్‌ గ్రుడినిన్‌కు 11.79 శాతం ఓట్లు వచ్చాయి. తాజా విజయంతో 2024 వరకూ పుతిన్‌ రష్యా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. అంతేకాకుండా నియంత జోసెఫ్‌ స్టాలిన్‌ (24 ఏళ్లు) తర్వాత అత్యధికకాలం రష్యాను పాలించిన నేతగా పుతిన్‌ రికార్డు సృష్టించారు.

2014లో ఉక్రెయిన్‌ నుంచి రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాలో పుతిన్‌కు 92 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి అలెక్సీ నావెల్నీపై రష్యా ఎన్నికల సంఘం వేటు వేయడంతో పుతిన్‌ విజయం లాంఛనప్రాయమైంది. నాలుగోసారి అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను జీవితాంతం రష్యా అధ్యక్షుడిగా కొనసాగబోనని పుతిన్‌ స్పష్టం చేశారు. 2030లో మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా? అన్న విలేకరుల ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ఏంటి.. నాకు వందేళ్లు వచ్చేవరకూ ఇక్కడే(అధ్యక్ష పీఠంపై) కూర్చోవాలా? అది జరగదు’ అని పుతిన్‌ జవాబిచ్చారు.

అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన పుతిన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో పాటు వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో, బొలీవియా అధ్యక్షుడు ఇవో మోర్లెస్‌లు అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంపు కోసం సెల్ఫీ పోటీలు, ఉచిత బహుమతులు, ఫుడ్‌ ఫెస్టివల్స్‌ తదితర కార్యక్రమాలు నిర్వహించిన రష్యా ప్రభుత్వం ఓటింగ్‌లో పాల్గొనాల్సిందిగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులపై తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చింది.

ఈ ఎన్నికల్లో తాము అనుకున్న దానికంటే ఎక్కువ పోలింగ్‌ జరిగిందనీ, ఇందుకు కారకులైన వివిధ దేశాధినేతలకు ధన్యవాదాలని ఫలితాల అనంతరం రష్యా ఎన్నికల సంఘం చీఫ్‌ ఎల్లా పాంఫిలోవా ఎద్దేవా చేశారు. మరోవైపు ఈ ఎన్నికల్లో పుతిన్‌ రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రస్తుతం రష్యాలో ఆశ్రయం పొందుతున్న అమెరికా నిఘా సంస్థ ఎన్‌ఎస్‌ఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ ఓ స్కూల్‌లో రిగ్గింగ్‌ జరుగుతున్న చిత్రాన్ని ట్వీటర్‌లో పోస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు