కొరియాను భయపెడితే ఊరుకోం: పుతిన్

16 May, 2017 19:49 IST|Sakshi
కొరియాను భయపెడితే ఊరుకోం: పుతిన్

చిట్టచివరి నిమిషంలో.. ఎవరికీ చెప్పకుండా ఉత్తరకొరియా అణ్వస్త్ర క్షిపణి పరీక్ష చేయడాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఖండించారు. అయితే, అదే సమయంలో ఆ దేశాన్ని బెదిరించడం కంటే, ఇతర దేశాలన్నీ దాంతో చర్చిస్తే మంచిదని చెప్పారు. ఇటీవలి కాలంలో ప్యాంగ్‌యాంగ్ చేస్తున్న తరహా అణ్వస్త్ర క్షిపణి పరీక్షలు ఆమోదయోగ్యం కాదని, అయితే కొరియా ద్వీపంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తేవాలంటే ఒక శాంతియుత పరిష్కారం అవసరమని తెలిపారు. అణు సామర్థ్యం ఉన్న దేశాల విస్తరణకు తాము కచ్చితంగా వ్యతిరేకమేనని, అలా చేయడం ప్రమాదకరమని పుతిన్ అన్నారు. అయితే అమెరికా పేరును మాత్రం ప్రస్తావించకుండా.. ఉత్తరకొరియాను భయపెట్టడాన్ని తాము ఏమాత్రం అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.

అమెరికా, దాని మిత్రదేశాలు కలిసి తమ దేశం మీద అణుదాడులు చేస్తామంటూ భయపెట్టడం వల్లే తాము క్షిపణి పరీక్ష నిర్వహించామని ఇటీవలే ఉత్తరకొరియా చెప్పిన సంగతి తెలిసిందే. తమ కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా తాము ఎక్కడైనా, ఎప్పుడైనా ఖండాంతర క్షిపణి పరీక్షలు చేయగలమని చైనాలో ఉత్తరకొరియా రాయబారి జి జే ప్యాంగ్ వ్యాఖ్యానించారు. మే 14న భూమి నుంచి 787 కిలోమీటర్ల దూరంలో 2,111.5 కిలోమీటర్ల ఎత్తున ఉన్న లక్ష్యాన్ని హ్వాసాంగ్-12 క్షిపణి ఛేదించిన పరీక్షను ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ పరీక్షలపై ప్రపంచ దేశాలన్నీ భగ్గుమన్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు