నర్సరీ బుడుగులకో ‘సెర్చ్‌ ఇంజన్‌’!

23 Jul, 2019 16:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అక్షరాలు సరిగ్గా రాని మూడేళ్లలోపు నర్సరీ పిల్లల కోసం గూగుల్‌ కంపెనీ ‘గూగుల్‌ అసిస్టెంట్‌’  తరహాలో ప్రత్యేక ఇంటర్నెట్‌ సర్చ్‌ ఇంజన్‌ను తీసుకొస్తోంది. వాయిస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీతో ‘గూగుల్‌ అసిస్టెంట్‌’ నడుస్తుందని, మన వాయిస్‌ కమాండ్‌ ద్వారా ఇంటర్నెట్‌లో మనకు కావాల్సిన సమాచారాన్ని అది అందిస్తుందని తెల్సిందే. ఇదే తరహాలో పనిచేసే, పిల్లలకు మరింత ఆకర్షణగా ఉండేలా దీన్ని తీసుకొచ్చేందుకు కషి చేస్తున్నామని. అప్పుడు దీనికి ‘గేమిఫైయింగ్‌ వాయిస్‌ సెర్చ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌’  పేరిట యూరప్‌లో పేటెంట్‌కు దరఖాస్తు కూడా చేశామని గూగుల్‌ యాజమాన్యం ప్రకటించింది. 

గూగుల్‌ అసిస్టెంట్, అమెజాన్‌ ఎకో ‘అలెక్సా’తో ప్రైవసీ దెబ్బతింటోందని గోల చేస్తున్న సామాజిక కార్యకర్తలు దీనివల్ల కూడా ప్రైవసీకి ముప్పుందంటూ మొత్తుకుంటున్నారు. పైగా చిన్నతనంలో పిల్లలను ఇంటర్నెట్‌కు బానిసలను చేయడం మరింత అన్యాయం అంటున్నారు. పిల్లల్లో ఆటలు సృజనాత్మకతను పెంచుతాయని, తాము రూపొందించాలనుకుంటున్నసెర్చ్‌ ఇంజన్‌ కూడా ఓ ఆటలాగే ఉంటుందని యాజమాన్యం చెబుతోంది. పిల్లలు బొమ్మలు చూసి పాఠాలు నేర్చుకున్నట్లే, వాటిని కంప్యూటర్లలో చూస్తూ మరింత వేగంగా నేర్చుకుంటారని వాదిస్తోంది. జీబ్రా, టైగర్‌ అంటూ పిల్లలు ఉచ్చరించగానే టేబుల్‌ టాప్‌లో వాటి బొమ్మలు ప్రత్యక్షమవడం వారికి ఆనందనిస్తాయని చెబుతోంది.
 
అయినా తాము పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసినంత మాత్రాన ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని, అది సక్సెస్‌ అవుతుందన్న గ్యారంటీ లేదని గూగుల్‌ చెప్పింది. చాలా ఐటీ కంపెనీలు ఇలా పేటెంట్లు దాఖలు చేసుకోవడం అందులో మూడోవంతు కార్యరూపం దాల్చకపోవడం తెల్సిందేనంటూ తెలిపింది. శిశువుల మల, మూత్ర విసర్జనలతోపాటు వారి తిండి, నిద్రను పర్యవేక్షిస్తూ తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సూచనలు చేసే ‘స్మార్ట్‌నాపీ’ పేరుతో పాంపర్స్‌ యాప్‌ లూమి వచ్చిన నేపథ్యంలోనే గూగుల్‌ నుంచి ఈ వార్త వెలువడడం హాట్‌ టాపిక్‌గా మారింది. శిశువుకు గదిలో ఎంత ఉష్ణోగ్రత ఉండాలో ముందుగానే ఫీడ్‌ చేసుకున్న ఈ యాప్‌ గదిలో ఉష్ణోగ్రత ప్రమాదకర స్థాయికి వెళ్లినప్పుడు, మూత్ర విసర్జనతో బట్టలు తడిసినప్పడు, డైపర్‌ మార్చాల్సి వచ్చినప్పుడు ఈ యాప్‌ స్మార్ట్‌ ఫోన్‌ సందేశాలతో తల్లిదండ్రులను హెచ్చరిస్తుంది. ఇది కూడా ప్రైవసీని దెబ్బతీస్తోందని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. 

మరిన్ని వార్తలు