ఆ దేశాల్లో ఓటెయ్యక పోతే వేటే

13 Mar, 2019 07:35 IST|Sakshi

33 దేశాల్లో ఓటు తప్పనిసరి.. లేకుంటే తిప్పలే

ఆంక్షలు విధించి.. అత్యధిక పోలింగ్‌ శాతం  

జరిమానాలు, ప్రభుత్వ సాయంలో కోతలు 

ఎక్కువ మంది ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలు జనరంజక పాలనను అందిస్తాయని, ఆ దిశగా పోలింగ్‌ శాతం పెంచేందుకు వివిధ దేశాలు పలు నిబంధనలు విధిస్తున్నాయి.మన రాష్ట్రంలో 65 శాతం, దేశంలో చాలాచోట్ల 60 శాతం ఓటింగ్‌ నమోదవడమే కష్టం. ఈ నేపథ్యంలో ఓటువేయడాన్ని పౌరులు బాధ్యతగా తీసుకోవాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది. ఓటు వేయడాన్ని తప్పనిసరి చేయాలన్న డిమాండ్‌ కూడా ప్రజాస్వామ్యవాదుల నుంచి బలంగా వినిపిస్తోంది. 

ఆస్ట్రేలియాలో అపరాధ రుసుము.. 
ఈ దేశంలో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలి. ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి. ఓటేయకుంటే జరిమానా విధిస్తారు. ఎన్నికలు జరిగిన వారంలోగా విచారణ చేపట్టి, అపరాధ రుసుము ఎంతన్నది నిర్ణయిస్తారు. ఇక్కడ 96 శాతం దాకా ఓటింగ్‌ నమోదవుతుంది. ఎన్నికలకు చాలా ముందునుంచే ఓటు హక్కు వినియోగంపై ప్రభుత్వం చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తుంది.  

గ్రీస్‌...డ్రైవింగ్‌ లైసెన్స్, పాస్‌పోర్టు రద్దు... 
ఈ దేశంలోఓటువేయకుంటే డ్రైవింగ్‌ లైసెన్స్, పాస్‌పోర్ట్‌ రద్దవుతాయి. ఓటుహక్కును వినియోగించుకోని వారు పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకుంటే అది మంజూరు కాదు. ఓటు వేయకపోవడానికి గల కారణాలను అధికారులకు ఆధారాలతో చూపించాల్సి ఉంటుంది. వారు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందితేనే మళ్లీ ఓటు హక్కును పునరుద్ధ్దరిస్తారు. ప్రభుత్వం నుంచి పొందే సౌకర్యాలపై ఆంక్షలు విధిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా 33 దేశాల్లో ఓటు వేయడం తప్పనిసరి. ఈ హక్కును వినియోగించుకోకుంటే కొన్ని దేశాలు జరిమానా విధిస్తుండగా, మరికొన్ని ప్రభుత్వ సాయాన్ని, సదుపాయాలను నిలిపేస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఉద్యోగుల జీతాలను కొంతకాలం నిలిపివేస్తున్నారు. మరికొన్ని దేశాల్లో ఓటు హక్కును తొలగిస్తున్నారు. సరైన కారణం చూపితేగాని దాన్ని పునరుద్ధరించే అవకాశం ఉండదు.  తప్పనిసరిగా ఓటు వేయాల్సిన దేశాల్లో ప్రముఖంగా బెల్జియం, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, అర్జెంటీనా, బొలీవియా, ఉక్రెయిన్, బ్రెజిల్, ఈజిప్టు, గ్రీస్, ఇటలీ, మెక్సికో, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, టర్కీ, స్విట్జర్లాండ్, నార్త్‌ కొరియా తదితర దేశాలున్నాయి. సింగపూర్‌లో ఓటు వేయని వారి పేర్లను ఓటరు జాబితాల నుంచి తొలగిస్తారు. ఓటు వేయకపోవడానికి కారణాలను, ఆధారిత పత్రాలను అధికారులకు సమర్పిస్తేనే తిరిగి వారి పేర్లను పునరుద్ధరిస్తారు. 

అత్యధిక పోలింగ్‌ శాతం  
ప్రపంచంలో అత్యధిక పోలింగ్‌ శాతం నమోదయ్యే దేశాల్లో ఆస్ట్రేలియా, చిలీ, బెల్జియం, ఇటలీ, లెక్సింబర్గ్‌  ముందుంటాయి. ఇక్కడ 90–96 శాతం మధ్య పోలింగ్‌ జరుగుతుంది. నెదర్లాండ్స్, స్లోవేకియా, ఆస్ట్రియా, స్వీడన్, జర్మనీ, డెన్మార్క్, న్యూజిలాండ్, ఐస్‌లాండ్‌ దేశాల్లో 80 శాతానికి పైగా నమోదవుతుంది. 60 శాతానికన్నా తక్కువగా అమెరికా, పాక్, స్విట్జర్లాండ్, రష్యా దేశాల ప్రజలు తమ ఓటు హుక్కును వినియోగించుకుంటున్నారు. వెనెజులా, నెదర్లాండ్స్, లెక్సింబర్గ్‌లలో ఓటింగ్‌ తప్పనిసరి. ఓటు వేయకుంటే ప్రభుత్వ రాయితీలు నిలిపివేస్తారు.

అనేక ఆంక్షలు... 
బెల్జియం...ఓటు వేయకుంటే భారీ జరిమానా... 
ఇక్కడ ఓటరు జాబితాలో పేరుండి, వరుసగా నాలుగు సార్లు ఓటెయ్యక పోతే...పదేళ్లవరకూ ఓటు హక్కును తొలగిస్తారు. మొదటిసారి ఓటు వేయకపోతే 2,000 నుంచి 4,000 యూరోల వరకూ జరిమాన.  రెండోసారి అయితే 10,000 యూరోల వరకూ జరిమానా విధిస్తారు. అంతే కాకుండా సర్కారు ఉద్యోగావకాశాలు, పథకాలు, సదుపాయాల్లో ప్రాధాన్యం తగ్గిస్తారు. ఎన్నికలు జరిగిన వారం రోజుల్లో ఓటు వేయని వారిపై చర్యలు తీసుకుంటారు. 

బొలీవియాలో ఓటుతోనే గుర్తింపు... 
ఈ దేశంలో ఓటు వేసినవారికి గుర్తింపు కార్డు జారీ చేస్తారు. అది ఉన్నవారికే ప్రభుత్వ సౌకర్యాలు లభిస్తాయి. రేషన్, విద్యుత్, తాగునీటి వసతి పొందాలంటే ఈ కార్డు తప్పనిసరి. ఉద్యోగులు  ఓటు వేయకపోతే మూడునెలలపాటు బ్యాంకుల నుంచి వేతనాలు డ్రా చేసే అవకాశం ఉండదు. దీంతో ప్రజలు అనేక విధాలుగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది.
 
ఆంక్షలు లేని అమెరికా...
అందుకే పోలింగ్‌ శాతం తక్కువ 
అమెరికాలో ఓటు వేయడంపై ఎలాంటి ఆంక్షలూ లేవు.. పోలింగ్‌ రోజున సెలవు ఉండదు. ఉద్యోగులు, ప్రజలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 వరకూ తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఇక్కడ 60 శాతం కన్నా పోలింగ్‌ తక్కువగా ఉంటుంది. 

వేయనివారి పేర్లు.. సర్టిఫికెట్లలలో.. 
ఇటలీ దేశంలో  ఓటు వేయడం పౌరుడి విధిగా రాజ్యాంగంలో పొందుపరిచారు. ఎన్నికల్లో ఓటు వేయనివారి పేర్ల జాబితాను పోలింగ్‌ కేంద్రాల 
వద్ద పెడతారు. పోలీసులు జారీచేసే అన్ని సర్టిఫికెట్లలో ఈ వివరాలు ఉంటాయి. దీంతో అక్కడి ప్రజలు ఓటు వినియోగించుకోవడంలో ప్రథమ స్థానంలో ఉన్నారు.  
– ఎలక్షన్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు