గోడలెక్కే రోబో జలగ

13 May, 2019 04:26 IST|Sakshi

టోక్యో: జలగ మాదిరిగా గోడలను సైతం సునాయాసంగా పాకుతూ ఎక్కగలిగే రోబోను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ రోబోలు భవనాల నిర్వహణ, తనిఖీ, అన్వేషణ, విపత్తు సమయాల్లో భవనాల లోపలికి వెళ్లగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని జపాన్‌లోని టోయోహాషి యూనివర్సిటీ, బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. దీని పేరు లీచ్‌(లాంగిట్యూడినల్లీ ఎక్స్‌టెన్సిబుల్‌ కంటినమ్‌ రోబోట్‌ ఇన్‌స్పైర్డ్‌ బై హిరుడినియా). దీనిని షవర్‌ హోస్‌(స్నానాల గదిలో వాడే పైపు), రెండు సక్షన్‌ కప్‌(గోడకు పట్టి ఉండే పరికరం)లను ఉపయోగించి తయారు చేశారు. జలగలు కొండలు, ఇతరత్రా ఎక్కేటప్పుడు వాటి శరీరంలో ఉండే సక్షన్‌ కప్‌లు ఉపయోగపడతాయని తాము గుర్తించామని అన్నారు. ఈ రెండింటితోపాటు మరికొన్ని పరికరాలను ఉపయోగించి దీనిని తయారు చేశామని వివరించారు. మృదువుగా, సౌకర్యవంతంగా ఉంటూ ఎలాంటి గోడలను అయిన ఎక్కగలిగే ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో ఇదేనని వెల్లడించారు. ఈ  వివరాలు సాఫ్ట్‌ రోబోటిక్స్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

మరిన్ని వార్తలు