‘ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్’

30 Nov, 2015 04:17 IST|Sakshi
‘ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్’

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐకమత్యం, సామరస్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ పథకాన్ని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ పథకం ఎలా ఉండాలి? లోగో, ప్రజల భాగస్వామ్యం పెంచటం, సమాజం బాధ్యతేంటి? వంటి విషయాలపై పౌరులందరూ సూచనలు ఇవ్వాలని కోరారు. అసహనంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చను దృష్టిలో పెట్టుకునే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

దీంతోపాటు అవయవదానంపై కూడా ప్రజలు ముందుకు రావాలని కోరారు. వైకల్యంతో బాధపడుతున్న వారు ఆ పరిస్థితిని అధిగమించేందుకు పడుతున్న శ్రమ స్ఫూర్తిని కలిగిస్తోందన్నారు. 1996లో కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో గాయపడి వెన్నెముకకు తీవ్రగాయంతో లేచి నడవలేని స్థితిలో ఉన్న జావెద్ అహ్మద్ అనే వ్యక్తి గురించి చెప్పారు. ఆయన జీవితమంతా వృథా అయినా.. తనలా వైకల్యంతో బాధపడుతున్న వారి భవిష్యత్తు బాగుండాలని ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు.

20 ఏళ్లుగా విద్యార్థులకు పాఠాలు చెబుతూనే.. వికలాంగుల పరిస్థితి మెరుగుపడే మౌలిక వసతులకోసం పోరాటం చేస్తున్నారన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన నూర్జహాన్ (55) అనే మహిళ పెద్దగా చదువుకోకపోయినా.. సోలార్ లాంతర్ల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిన విషయాన్ని తెలిపారు. నెలకు ఒక లాంతరుకు రూ.100 అద్దెతో (రోజుకు 3.3 రూపాయల ఖర్చుతో) 500 ఇళ్లకు ఈ లాంతర్లను సరఫరా చేస్తున్నారన్నారు.  

పర్యావరణంపై పోరు ప్రపంచం ముందున్న సవాలని, అగ్రదేశాలే ఎక్కువ కాలుష్యం చేస్తున్నాయని పేర్కొన్నారు. సౌరవిద్యుత్ వినియోగంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. వ్యవసాయ అవశేషాలను తగలబెట్టి పర్యావరణ కాలుష్యం చేసేకన్నా.. దాన్ని ఎరువుగా మార్చుకోవటంపై దృష్టి పెట్టాలన్నారు.
 
‘ధన్యవాద్.. ప్రభుత్వ సాయం చేస్తే!’
మన్ కీ బాత్‌లో ప్రధాని తన గురించి చెప్పడంపై నూర్జహాన్ హర్షం వ్యక్తం చేశారు. ‘మూడేళ్ల క్రితం ఓ ఎన్జీవో సహకారంతో సౌర విద్యుత్ లాంతర్లను అద్దెకివ్వటంపై దృష్టి పెట్టాను. ప్రధాని ఆర్థిక సాయం చేస్తే.. 100 ఇళ్లలో వెలుగులు పంచుతాను’ అని అన్నారు.

మరిన్ని వార్తలు