వందవ వసంతంలోకి అడుగుపెట్టిన వరల్డ్‌ హీరో

30 Apr, 2020 14:11 IST|Sakshi

కెప్టెన్‌ టామ్‌ మూర్‌కు ‌గౌరవ కల్నల్ హోదా‌

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాల ప్రజలను ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ కుమ్మేస్తున్న నేపథ్యంలో లండన్‌లోని నేషనల్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌)కు 29 మిలియన్‌ పౌండ్లను (దాదాపు 272 కోట్ల రూపాయలు) విరాళంగా సేకరించి ప్రపంచ నలుమూలల నుంచి ప్రశంసలు అందుకుంటున్న రెండో ప్రపంచ యుద్ధం కెప్టెన్‌ టామ్‌ మూర్‌ గురువారం నాడు వందవ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన శతజయంతిని పురస్కరించుకొని బ్రిటీష్‌ రాణి ఎలిజబెత్‌ ఆయన్ని ‘హానరరీ కల్నల్‌ (గౌరవ కల్నల్‌)’ హోదాతో సత్కరించారు. 
(చదవండి : డబ్ల్యూహెచ్‌ఓ విఫలం.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు)

బ్రిటన్‌ త్రివిద దళాధిపతుల చీఫ్‌ జనరల్‌ సర్‌ మార్క్‌ కార్ల్‌టన్‌ స్మిత్‌ స్వయంగా కెప్టెన్‌ మూర్‌ వద్దకు వెళ్లి హర్రోగేట్‌ ఆర్మీ ఫౌండేషన్‌ కాలేజ్‌ తరఫున హానరరీ కల్నల్‌ బ్యాడ్జీని అందజేశారు. కల్నల్‌ టామ్‌ యువ సైనికులకే కాకుండా తమలాంటి వృద్ధతరానికి కూడా స్ఫూర్తిదాయకమని జనరల్‌ సర్‌ మార్క్‌ ప్రశంసించారు. టామ్‌ వందవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని షాంపియన్‌ జల్లుల మధ్య కేక్‌కు కట్‌ చేశారు. సైనిక వైమానికి దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు ఆయనకు గౌరవ వందనంగా గాల్లో చెక్కర్లు కొట్టారు. 
(చదవండి : అమ్మకానికి మూన్‌రాక్‌.. ధర ఎంతం‍టే..)

టామ్‌కు రాణి ఎలిజబెత్‌తోపాటు ప్రిన్స్‌ చార్లెస్, కమిల్లాలు అభినందనలు లేఖలు పంపించారు. ఆయన ఒక్క సైన్యానికే కాకుండా మొత్తం దేశానికే ఆదర్శప్రాయుడిగా నిలిచారని ఈ కార్యక్రమానికి హాజరైన రక్షణ మంత్రి బెన్‌ వ్యాలెస్‌ ప్రశంసిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. బెడ్‌ఫోర్డ్‌షైర్‌లో నివసిస్తున్న టామ్‌ మూర్‌ పది రోజుల క్రితం కరోనా వైరస్‌పై యుద్ధానికి అవసరమైన విరాళాలను ఎన్‌హెఎస్‌కు ఇవ్వాల్సిందిగా కోరుతూ తన గార్డెన్‌లో పలు రౌండ్లు నడిచారు. దీన్ని బీబీసీ ద్వారా లైవ్‌లో చూసిన ప్రపంచ దేశాల్లో దాదాపు 60 దేశాలు విరాళాలు ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజల నుంచి లక్షలాది గ్రీటింగ్‌ కార్డులు ఆ రోజు నుంచి రావడం మొదలయ్యాయి. వాటిని ఓ పాఠశాలలో భద్రపరచగా హాలు నిండి పోయింది. వాటిని ఫొటో తీసిన టామ్‌ మనవడు బెంజీ ఇన్‌గ్రామ్‌ మూర్‌ తాతకు సమర్పించారు. 

మరిన్ని వార్తలు