చైనా ప్రకటన కంటే ముందే ఆ దేశంలో కరోనా వైరస్‌!

5 May, 2020 10:28 IST|Sakshi

చాపకింద నీరులా విస్తరించే కరోనా...

పారిస్‌: మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) ధాటికి ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్నాయి. కొన్నిచోట్ల వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టినా.. చాపకింద నీరులా విస్తరించే ఈ ప్రాణాంతక వైరస్‌తో కొన్నాళ్లపాటు సహజీవనం చేయకతప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా నివారణకు ఇంతవరకు వ్యాక్సిన్‌ కనిపెట్టకపోవడంతో వైరస్‌ భయం ప్రజలను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కేంద్రస్థానంగా భావిస్తున్న చైనాపై దేశాలన్నీ విరుచుకుపడుతున్నాయి. మహమ్మారిని ప్రపంచం మీదకు వదిలి సంక్షోభానికి కారణమైందని తిట్టిపోస్తున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా చైనాపై కారాలు మిరియాలు నూరుతూ పరిహారం చెల్లించాలంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో.. శాస్త్రవేత్తలు పేషెంట్‌ జీరో జాడ కోసం అన్వేషిస్తున్న క్రమంలో కరోనా గురించి చైనా అధికారింగా ప్రకటించే కంటే ముందే ఫ్రాన్స్‌లో కరోనా లక్షణాలతో బాధపడుతున్న పేషెంట్లను గుర్తించినట్టు ఓ అధ్యయనంలో తేలింది. (కరోనా పేషెంట్లకు నికోటిన్‌ ప్యాచ్‌లు!)

పారిస్‌లోని అవిసెనె అండ్‌ జీన్‌ వెర్డీర్‌ ఆస్పత్రిలో ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలతో బాధపడతున్న 14 మంది రోగుల నుంచి సేకరించిన నమూనాల్లో.. ఓ 42 ఏళ్ల వ్యక్తికి కోవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ అయ్యిందని ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ యాంటీమైక్రోబియల్‌ ఏజెంట్స్‌ పేర్కొంది. సదరు పేషెంట్‌ డిసెంబరు 27న ఆస్పత్రిలో చేరాడని... అదే విధంగా అతడికి చైనాకు వెళ్లినట్లుగా ప్రయాణ చరిత్ర కూడా లేదని వెల్లడించింది. ఈ విషయం గురించి అవిసెనె ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌ విభాగాధిపతి ఓలివెర్‌ బౌచర్డ్‌ మాట్లాడుతూ.. చాపకింద నీరులా వైరస్‌ ప్రజల్లో విస్తరించిందని.. అది తమకు సోకిందన్న విషయం కూడా చాలా మంది ప్రజలకు తెలియదని పేర్కొన్నారు. (చైనా తక్కువ చేసి చూపింది: అమెరికా)

అదే విధంగా మెడికల్‌ సెక్రటరీగా పనిచేస్తున్న ఐచా(57) అనే వ్యక్తి మాట్లాడుతూ... జనవరి రెండోవారంలో తాను తీవ్రమైన శ్వాసకోశ సంబంధ సమస్యలతో ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించారు. అదే సమయంలో చైనాలోని వుహాన్‌లో కరోనా ఆనవాళ్లు బయటపడ్డాయని పేర్కొన్నారు. తనలో ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయని.. రుచి, వాసన తెలియలేదని వైద్యుడైన ఐచా భర్త తెలిపారు. కాగా గతేడాది డిసెంబరులో చైనాలోని వుహాన్‌ నగరంలో తొలిసారిగా కరోనా ఆనవాళ్లు బయటపడిన విషయం తెలిసిందే. ఈ వైరస్‌ క్రమంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ దాదాపు రెండున్నర లక్ష మందికి పైగా బలితీసుకుంది. లక్షలాది మంది ఈ మహమ్మారి బారిన పడి విలవిల్లాడుతున్నారు. అయితే ఫాన్స్‌ వైద్యుల తాజా అధ్యయనం ప్రకారం తమ దేశంలో కూడా డిసెంబరులో గుర్తు తెలియని వైరస్‌ బయటపడిందని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. (ఆ నగరాల్లో.. కరోనా కమ్మేసింది ఇలా..)

ఇక ఈ పరిణామాల గురించి ఇటాలియన్‌ పరిశోధకులు మాట్లాడుతూ.. లాంబోర్డిలో జనవరి ఆరంభంలోనే వైరస్‌ ప్రవేశించిందని... అయితే ఫిబ్రవరి 20 తర్వాతే అక్కడ తొలి కేసు నమోదైందని పేర్కొన్నారు. మిలాన్‌ నుంచి వచ్చిన ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు డిసెంబరు ఆరంభంలోనే తమకు వైరస్‌ లక్షణాలు కనిపించాయని.. అయితే కొన్నాళ్ల తర్వాత ఎటువంటి చికిత్స లేకుండానే కోలుకున్నారని తెలిపారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అనంతరం వారికి సీరలాజికల్‌ టెస్టు(యాంటీ బాడీ టెస్టు) నిర్వహించగా.. రక్తంలో యాంటీబాడీస్‌ ఉత్పత్తి కావడం గుర్తించామని.. కరోనా వారి శరరీంలో ఎప్పుడు ప్రవేశించిందో.. ఎప్పుడు అంతమైపోయిందో వారికి కూడా తెలియలేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో కరోనా గురించి పూర్తి వివరాలు మనకు ఎప్పటికీ తెలిసే అవకాశం లేదని ఫుట్‌బాల్‌ జట్టు బృందంలోని ఓ ఆటగాడు అభిప్రాయపడ్డాడు. 

>
మరిన్ని వార్తలు