రాఫెల్‌ డీల్‌పై ఫ్రాన్స్‌ అధ్యక్షుడి స్పందన

26 Sep, 2018 09:24 IST|Sakshi
యూఎన్‌లో ప్రసంగిస్తున్న ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్‌ మాక్రోన్‌

న్యూయార్క్‌ : రోజుకో మలుపు తిరుగుతున్న రాఫెల్‌ డీల్‌ వివాదంపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్‌ మాక్రోన్‌ స్పందించారు. రాఫెల్‌ డీల్‌ వివాదంపై డైరెక్ట్‌గా సమాధానం చెప్పకుండా... భారత్‌, ఫ్రాన్స్‌ల మధ్య ఈ వేల కోట్ల డీల్‌ జరిగేటప్పుడు తాను పదవిలో లేనని చెప్పారు. యునిటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీలో పాల్గొన్న సమయంలో ప్రెస్‌తో సమావేశమైన సమయంలో ఈ మేరకు స్పందించారు. మాజీ ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండ్‌ చెప్పిన మాదిరి మోదీ ప్రభుత్వమే అనిల్‌ అంబానీ రిలయన్స్‌ డిఫెన్స్‌ను భారత భాగస్వామిగా చేర్చుకోవాలని ఫ్రెంచ్‌ ప్రభుత్వానికి లేదా రాఫెల్‌ తయారీదారి డసో ఏవియేషన్‌ సంస్థకు ప్రతిపాదించిందా? అని అధ్యక్షుడు మాక్రోన్‌ను రిపోర్టర్లు ప్రశ్నించారు. 

వీరి ప్రశ్నపై స్పందించిన మాక్రోన్‌.. ‘ఏ ఆరోపణలను నేను ప్రత్యక్షంగా తిప్పికొట్టలేను. ఆ సమయంలో నేను ఇన్‌ఛార్జ్‌గా లేను. కానీ మేము చాలా స్పష్టమైన నిబంధనలు కలిగి ఉన్నాం. ఇది ప్రభుత్వానికి ప్రభుత్వానికి సంబంధించిన చర్చ. ఇది భారత్‌, ఫ్రాన్స్‌ల మిలటరీ, డిఫెన్స్‌ల సంకీర్ణ ఒప్పందం’ అని తెలిపారు. కాగా, గతేడాది మేలోనే ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా మాక్రోన్‌ ఎన్నికయ్యారు. రాఫెల్‌ డీల్‌ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016లో ప్రకటించారు. ఆ సమయంలో ఫ్రాంకోయిస్‌ హోలాండ్‌ ఫ్రాన్స్‌ అ‍ధ్యక్షుడు. భారత ప్రభుత్వం సూచనమేరకే రిలయన్స్‌ డిఫెన్స్‌ని ఒప్పందంలో భాగస్వామిగా చేసుకున్నట్టు ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలండ్‌ గత వారం పేల్చిన బాంబుతో, భారత్‌లో రాఫెల్‌ వివాదం తారాస్థాయికి చేరుకుంది. 

కాగా, రాఫెల్‌ ఒప్పందం కుదుర్చుకోవడానికి అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హోలాండ్‌ సహచరి, నటి జూలీ గయె ప్రధాన పాత్రలో రెండు సినిమాలు నిర్మించడానికి అంగీకరించింది. జూలీ గయె ప్రొడక్షన్‌ హౌస్‌తో కలిసి తాము ఫ్రెంచ్‌ సినిమాలు తీస్తామంటూ అనిల్‌ అంబానీ అప్పట్లో ఒక ప్రకటన విడుదల చేశారు కూడా. క్విడ్‌ ప్రో కో ఒప్పందంలో భాగంగా రాఫెల్‌ కాంట్రాక్ట్‌ తమకి దక్కడం కోసమే రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినీ రంగంలో పెట్టుబడులు పెట్టిందని కూడా కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ ఆరోపణలను ఫ్రెంచ్‌ ప్రభుత్వం, డసో కంపెనీ కొట్టిపారేస్తున్నాయి. ప్రభుత్వ రంగ కంపెనీ హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ను పక్కనపెట్టి, ఒక ప్రైవేట్‌ సంస్థను ఎలా ఎంపిక చేశారంటూ కాంగ్రెస్‌ మండిపడుతోంది కూడా.  
 

మరిన్ని వార్తలు