ఉక్కునైనా ఛేదించగల వాటర్‌గన్‌

13 Feb, 2018 10:42 IST|Sakshi
వాటర్‌గన్‌ ను పరీక్షిస్తున్న సిబ్బంది (ఫైల్ ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ: ఉక్కునైనా ఛేదించగల వాటర్‌గన్‌ అందుబాటులోకి వచ్చింది. దీనిని షూట్‌ చేస్తే, ఇందులోంచి పెనువేగంతో దూసుకొచ్చే నీరు.. ఉక్కు, కాంక్రీట్, ఇటుకలు, చివరకు బులెట్‌ప్రూఫ్‌ గ్లాస్‌ను కూడా ఛేదించగలదు. ఏదైనా గోడపై దీనిని గురిచూసి ప్రయోగిస్తే, మూడంగుళాల రంధ్రం ఏర్పడి, అందులోంచి నీరు లోపలకు దూసుకుపోతుంది. అగ్నిమాపక పరికరాలను తయారు చేసే ‘పైరోలాన్స్‌’ అనే కంపెనీకి చెందిన నిపుణులు ఈ వాటర్‌గన్‌ను అల్ట్రా హైప్రెషర్‌ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఈ ‘పైరోలాన్స్‌’ వాటర్‌గన్స్‌ను ప్రస్తుతం అమెరికన్‌ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ బలగాలు ఉపయోగిస్తున్నాయి. 

కొన్ని విమానాశ్రయాల్లో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటి సైజును బట్టి ఒక్కొక్కటి 15 వేల డాలర్ల నుంచి 80 వేల డాలర్ల వరకు ఇవి దొరుకుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అగ్నిమాపక దళాలు వీటిని ఉపయోగించేటట్లయితే చాలా వరకు అగ్నిప్రమాదాలను నిరోధించవచ్చని ‘పైరోలాన్స్‌’ కంపెనీకి చెందిన ఇంజనీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండులు, షాపింగ్‌మాల్స్, సినిమా థియేటర్స్‌ వంటి జనసమ్మర్దం గల ప్రదేశాల్లో వీటిని అందుబాటులో ఉంచితే, అగ్నిప్రమాదాలను తేలికగా అరికట్టడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. 

   

మరిన్ని వార్తలు