అమెరికా @ 12" మంచు

30 Dec, 2018 02:11 IST|Sakshi
అమెరికాలో భారీగా మంచు, పెనుగాలుల్ని చూపుతున్న ఉపగ్రహ చిత్రం

షికాగో: భారీ మంచు తుపాను, చలిగాలుల కారణంగా అమెరికాలో ఏడుగురు మృతి చెందగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం ఒక్కరోజే 500 పైగా విమాన సర్వీసులు రద్దు కాగా 5,700 విమానాలు ఆలస్యంగా నడిచాయి. మంచు తుపాను కారణంగా చాలా చోట్ల 12 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. ఈ తీవ్రత రానున్న రోజుల్లో న్యూమెక్సికోతోపాటు దక్షిణ, తూర్పు రాష్ట్రాల్లో మరింత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణాది రాష్ట్రాల్లో చలితోపాటు భారీ వర్షాలతో పాటు వరదలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది.

లూసియానా, కెన్సాస్, నార్త్‌ డకోటా, టెన్నిస్సీ, మిన్నెసొట్టా ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, తొమ్మిది మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. గురువారం కూడా దేశవ్యాప్తంగా 6,500 విమానాలు ఆలస్యంగా నడవగా మరో 800పైగా సర్వీసులు రద్దయినట్లు వివరించారు. మంచు కారణంగా చాలా చోట్ల రహదారులను కూడా మూసి వేశారు. మరికొద్ది రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో చాలా మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలకు దూరం కావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు