ఇక మంచినీటికి భారత్‌లో కటకట

15 Feb, 2016 14:39 IST|Sakshi

వాషింగ్టన్: భారత్, చైనా, అమెరికాతోపాటు పలు దేశాలు ఈ ఏడాది తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కోనున్నాయి. నెల నుంచి మూడు నెలల పాటు ప్రపంచంలోని నాలుగు వందల కోట్ల మంది ప్రజలు మంచినీళ్లు దొరక్క అల్లాడిపోయే పరిస్థితి ఉందని అమెరికా నుంచి వెలువడుతున్న ‘సైన్స్ అడ్వాన్సెస్’ పత్రిక ప్రచురించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ నాలుగు వందల కోట్ల మందిలో దాదాపు రెండు వందల కోట్ల మంది ప్రజలు భారత్, చైనా దేశాలకు చెందిన వారే ఉంటారని, వారికే నీటి వనరుల లభ్యత కష్టమవుతుందని ఆ అధ్యయనం తెలిపింది. అలాగే అమెరికా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నైజీరియాకు చెందిన దేశాల్లో మరో రెండు వందల కోట్ల మంది మంచినీళ్లు దొరక్క అలమటించాల్సిన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని తేలింది.

 అలాగే ప్రపంచంలో దాదాపు యాభై కోట్ల మంది ప్రజలు ఏడాది పొడవునా నీటి ఎద్దడిని ఎదుర్కొంటారని, వారిలో కూడా జనాభాపరంగా ఎక్కువగా భారత్, పాకిస్తాన్‌లకు చెందిన వారే ఉంటారని అధ్యయనం సూచిస్తోంది. సౌదీ అరేబియా, యెమెన్ ప్రజలు కూడా ఏడాది పొడవున నీటి కరవును ఎదుర్కొంటారు. ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి పరిస్థితి గతంలో వేసిన అంచనాలకన్నా తీవ్రంగా ఉంటాయని తేలింది. 170 కోట్ల నుంచి 300 కోట్ల మధ్య ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటారన్నది గతంలో వేసిన అంచనాలు. అప్పట్లో ఏడాది కాలాన్ని ప్రతిపాదికగా తీసుకొని అధ్యయనం చేయగా, ఈ తాజా అధ్యయనం నెలను ప్రాతిపదిక గా తీసుకొని 12 నెలలకు అంచనాలను వేసింది.

 రక్షిత మంచినీటి వనరులు క్షీణించడం, తాగునీటి అవసరాలు పెరగడం వల్లనే మంచినీటికి కటకటలాగే పరిస్థితి వస్తుందని అధ్యయన నిపుణులు తెలిపారు. దీనివల్ల మానవాభివృద్ధి గమనం మందగిస్తుందని చెప్పారు. మున్ముందు ఓ పక్క పర్యావరణాన్ని రక్షించుకుంటూ తాగునీటి వనరులను సమకూర్చుకోవడం మానవాళికి పెద్ద సవాల్‌గా పరిణమించనుందని వారు అభిప్రాయపడ్డారు. వాతావరణంలో ఊహించని మార్పులు సంభవించడం వల్ల రానున్న పదేళ్లకాలంలో ప్రపంచం తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రపంచ ఆర్థిక ఫోరమ్ కూడా జనవరిలో విడుదల చేసిన ఓ నివేదికలో హెచ్చరించింది.

మరిన్ని వార్తలు