జాధవ్‌ క్షమాభిక్షను విశ్లేషిస్తున్నాం : పాక్‌

17 Jul, 2017 02:11 IST|Sakshi
ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్‌ జాధవ్‌(46)కు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను ఆర్మీ చీఫ్‌ మేజర్‌ ఖమర్‌ జవేద్‌ బజ్వా విశ్లేషిస్తున్నట్లు పాక్‌ సైన్యం తెలిపింది. అన్ని వివరాలు పరిశీలించిన అనంతరం జాధవ్‌ అప్పీలుపై బజ్వా తుది నిర్ణయం తీసుకుంటారని ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఆసిఫ్‌ గఫూర్‌ ఆదివారం మీడియాకు వెల్లడించారు.

మరణ శిక్షను రద్దు చేయడానికి ఇక్కడి మిలటరీ అప్పీల్‌ కోర్టు నిరాకరించడంతో జూన్‌లో జాధవ్‌ పాక్‌ ఆర్మీ చీఫ్‌కు క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేసుకున్నట్లు గఫూర్‌ పేర్కొన్నా రు. ఒకవేళ ఆర్మీ చీఫ్‌ జాధవ్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తే..అతను వెంటనే పాక్‌ అధ్యక్షుడికి క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చన్నారు. ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది భారత్‌ 580 సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని గఫూర్‌ ఆరోపించారు. చైనా పాకిస్తాన్‌ ఆర్థిక కారిడార్‌(సీపీఈసీ) దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకమని తెలిపారు. సీపీఈసీకి పాక్‌ ఆర్మీ పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తుందని గఫూర్‌ పేర్కొన్నారు. 
మరిన్ని వార్తలు