ప్రకృతి ప్రళయం...మనుషుల హననం

9 Dec, 2018 03:43 IST|Sakshi

విపత్తు మరణాల్లో మనది రెండో స్థానం 

ఆస్తినష్టంలో 14వ స్థానం 

క్లైయిమేట్‌ రిస్క్‌ ఇండెక్స్‌– 2018 జాబితా విడుదల

సైన్స్‌ సాయంతో ప్రకృతిని నాశనం చేయగల్గుతున్న మానవుడు.. ఆ సైన్సే ఆయుధంగా ప్రకృతి విధ్వంసాలను ఎదుర్కోగల్గుతున్నాడా? అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో తుపానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తుల్ని చేయడం ద్వారా ఇటీవలి కాలంలో ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించగలుగుతున్నాం. అయితే, ప్రపంచ దేశాలతో పోలిస్తే గతేడాది ప్రకృతి విపత్తు మరణాల్లో మన దేశం రెండో స్థానంలో ఉంది. గతేడాది మన దేశంలో ప్రకృతి విపత్తుల వల్ల 2,736 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,978 మరణాలతో ప్యూర్టోరికా మొదటి స్థానంలో ఉంది. అయితే, ప్రకృతి వైపరీత్యాలకు ఎక్కువగా ప్రభావితమయ్యే దేశాల్లో (ఆస్తినష్టం) భారత్‌ 14వ స్థానంలో ఉంది. 

181 దేశాలకు ర్యాంకులు: ప్రపంచవ్యాప్తంగా వరదలు, తుపాన్లు,టోర్నడోలు, శీతలపవనాలు, వేడి గాలుల వంటి ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతినే దేశాల జాబితాను జర్మనీకి చెందిన జర్మన్‌వాచ్‌ అనే స్వతంత్ర సంస్థ ఏటా విడుదల చేస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల లక్ష మంది జనాభాకు ఎంతమంది చనిపోయారు, జీడీపీలో ఒక యూనిట్‌కు ఎంత నష్టం వచ్చింది అన్న అంశాల ఆధారంగా ‘క్లైమేట్‌ రిస్క్‌ ఇండెక్స్‌(సీఆర్‌ఐ)’పేరుతో జాబితా విడుదల చేస్తుంది. పోలెండ్‌లోని కటోవైస్‌లో ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు జరుగుతున్న నేపథ్యంలో జర్మన్‌వాచ్‌ 2017 జాబితాను విడుదల చేసింది. దీనిలో 181 దేశాలకు ర్యాంకులు ఇచ్చింది. ప్రాణ నష్టానికి సంబంధించి ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న భారత్, ఆస్తి నష్టంలో14వ స్థానంలో ఉంది. 2016లో 6వ స్థానంలో, 2015లో నాలుగో స్థానంలో ఉన్న భారత్‌ ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కోవడంతో పరిస్థితిని మెరుగుపరుచుకొని తాజా జాబితాలో14వ స్థానానికి చేరింది. ప్యూర్టోరికా అమెరికాలో భాగమే అయినప్పటికీ, అక్కడి విభిన్న వాతావరణ పరిస్థితుల ఆధారంగా దాన్ని ప్రత్యేక దేశంగా చూపించినట్టు జర్మన్‌ వాచ్‌ పేర్కొంది. 
రెండు దశాబ్దాల్లో 73 వేల ప్రాణాలు.. 
కాగా, గత 20 సంవత్సరాల్లో (1998–2017) ప్రకృతి విపత్తుల వల్ల భారత దేశం 73 వేల మంది ప్రాణాలను, రూ.1.82 లక్షల కోట్ల ఆస్తిని కోల్పోయిందని తాజా నివేదిక తెలిపింది.  2017లో ఈ విపత్తుల వల్ల భారతదేశం రూ. 9.84 వేల కోట్ల డాలర్ల విలువైన ఆస్తి నష్టపోయింది. 2017లో ప్రపంచవ్యాప్తంగా 11,500 మంది ప్రాణాలు కోల్పోయారని, రూ.2267 లక్షల కోట్ల ఆస్తినష్టం వాటిల్లిందని పేర్కొంది. 

బడుగు దేశాలే వణికిపోతున్నాయి.. 
ప్రమాదాలను గుర్తించే ఆధునిక సాంకేతికత కొరతతో ప్రకృతి వైపరీత్యాలకు ధనిక దేశాల కంటే బడుగు దేశాలే ఎక్కువ ప్రభావితమవుతున్నాయి. అయితే, 2017 హరికేన్‌ సీజన్‌లో ధనిక దేశాలు కూడా దెబ్బతిన్నాయని తాజా నివేదిక వెల్లడించింది.  

మరిన్ని వార్తలు