సన్నబడడం చాలా సింపుల్!

10 Nov, 2015 08:32 IST|Sakshi
సన్నబడడం చాలా సింపుల్!

టోక్యో: నాజూకైన శరీరాకృతిని పొందాలనుకునేవారికి, ఊబకాయులుగా మారిపోతున్నామని ఆందోళన చెందుతున్నవారికి ఓ గుడ్ న్యూస్. మీరు సన్నబడేందు కోసం ఇకపై తిండితిప్పలు మానెయ్యాల్సిన అవసరం లేదు. చెమటలు కక్కేదాక కసరత్తులు చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. చాలా సింపుల్‌గా  మీరు సన్నబడొచ్చు. అదెలాగో తెలుసా.. బస్సులోనో, రైల్లోనో ప్రయాణించండంతే. జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైంది కూడా. మిగతావారితో పోలిస్తే బస్సులు, రైళ్లలో ప్రయాణించేవారు ఊబకాయంబారిన పడే అవకాశం 44 శాతం తక్కువట.

అంతేకాదు రక్తపోటు(బీపీ) బారినపడే అవకాశం 27 శాతం, మధుమేహం బారిన పడే అవకాశం 34 శాతం తక్కువని తమ అధ్యయనంలో తేలిందని చెబుతున్నారు. బరువు తగ్గేందుకు రెండుమూడు కిలోమీటర్లు వాకింగ్, జాగింగ్ చేస్తారనుకుంటే .. ఆఫీసుకు వెళ్లడం కోసం ఇంటి నుంచి స్టేషన్‌కు, స్టేషన్ నుంచి ఆఫీసుకు, తిరిగి ఆఫీసు నుంచి స్టేషన్‌కు, అక్కడి నుంచి ఇంటికి నడిచే దూరం మనకు తెలియకుండానే ఎక్కువగా ఉంటుందట.

పైగా కార్లలో లేదా బైక్‌పై ఒంటరిగానో లేదా ఒకరిద్దరితో కలసి ప్రయాణం చేస్తామని.. అదే బస్సు, రైళ్లలో అయితే కొత్త కొత్త పరిచయాలు, కొత్త సంఘటనలు తారసపడుతుంటాయని.. ఇవన్నీ మనలోని ఒత్తిడిని తగ్గించి మధుమేహం, ఊబకాయం, రక్తపోటుబారిన పడకుండా చేయడమే కాకుండా శరీరం ఎప్పుడూ చలాకీగా, నాజూగ్గా ఉంచుతాయట. జపాన్‌లోని మొరిగుచికి చెందిన 5,908 మందిపై చేసిన అధ్యయనంలో ఈ విషయం రుజువైందన్నారు. ఈ జపాన్ శాస్త్రవేత్తలు చెబు తున్న విషయం చాలా బాగుంది కదూ.. ఇలా చేస్తే మంచి శరీరాకృతితో పాటు మరెన్నో కలిసొస్తాయి. సో.. వెయిట్ ఫర్ ఎ బస్ అంట్ రైట్ రైట్!

>
మరిన్ని వార్తలు