బుల్లెట్‌ రైళ్లలో విశేషాలెన్నో!

19 Sep, 2019 16:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే బుల్లెట్‌ రైల్‌ను ప్రవేశపెట్టిన దేశం జపాన్‌. అది టోక్యో, ఒసాకా మధ్య 1964, అక్టోబర్‌ ఒకటవ తేదీన ప్రారంభమైంది. హిటాచి కంపెనీ తయారు చేసిన ఈ బుల్లెట్‌ రైలు వేగం అప్పుడు గంటకు 210 కిలోమీటర్లు. ఇప్పుడు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడిచే బుల్లెట్‌ రైళ్లు వచ్చాయి. బుల్లెట్‌ రైళ్ల ఆలస్యం సాధారణంగా 30 సెకన్లు మాత్రమే. ఒక నిమిషం ఆలస్యమైతే దాన్ని ఆలస్యంగా పరిగణిస్తారు. ఐదు నిమిషాలు ఆలస్యమైతే అందుకు కారణం ఏమిటో ఆ రైలును నడుపుతున్న కంపెనీ ప్రభుత్వానికి సమాధానం ఇచ్చుకోవాలి. బుల్లెట్‌ రైళ్ల వల్ల ఈ 55 ఏళ్లలో ఒక్కరు కూడా మరణించక పోవడం విశేషం. 1960వ దశకం నుంచి జపాన్‌లో బుల్లెట్‌ రైళ్లను నడుపుతున్న ఇటాచీ కంపెనీ ఆ తర్వాత బుల్లెట్‌ ట్రైన్‌ల టెక్నాలజీని బ్రిటన్‌లో ప్రవేశ పెట్టింది. 

2009లో అత్యధిక వేగంతో, అంటే గంటకు 140 మైళ్ల వేగంతో నడిచే ‘జావెలిన్‌’ రైలును లండన్‌లోని సెయింట్‌ ప్యాంక్రాస్‌ ఇంటర్నేషనల్‌ నుంచి కెంట్‌ వరకు ప్రవేశ పెట్టింది. ఈ బుల్లెట్‌ రైళ్లు ఎంత వేగంతో ప్రయాణించినప్పటికీ లోపలున్న ప్రయాణికులకు పెద్దగా శబ్దం వినిపించకుండా ఉండే సౌకర్యంగా ఉంటుంది. ట్రైన్‌ వెళుతున్నప్పుడు బయట నుంచి చూసే ప్రజలకు కూడా పెద్దగా శబ్దం వినిపించక పోవడం దాని సాంకేతిక పరిజ్ఞాన గొప్పతనం. అల్ఫా ఎక్స్‌గా పిలిచే షింకాన్సేన్‌ అనే కొత్త బుల్లెట్‌ ట్రెయిన్‌ను తూర్పు జపాన్‌ రైల్వే కంపెనీ త్వరలోనే తీసుకరాబోతోంది. దీని వేగం గంటకు 360 కిలోమీటర్లు. యూరప్‌లో నడుస్తున్న హైస్పీడ్‌ బుల్లెట్‌ రైళ్ల కన్నా ఈ షింకాన్సేన్‌ రైలు 0.3 మీటర్లు వెడల్పు ఎక్కువగా ఉంటుంది. 

బుల్లెట్‌ రైళ్లకు భూ ప్రకంపనలు గుర్తించే సెన్సార్లు ఉంటాయి. ఎక్కడైనా భూ ప్రకంపనలు వచ్చినట్లయితే వెంటనే వాటంతట అవే నిలిచిపోతాయి. ఈ బుల్లెట్‌ రైళ్లు వచ్చినప్పుడు, వెళుతున్నప్పుడు సిబ్బంది నడుము వరకు వంగి గౌరవ వందనం చేస్తారు. రగ్బీ ప్రపంచకప్‌కప్‌ సమీపిస్తున్న సందర్భంగా ఈ బుల్లెట్‌ రైళ్లను మరింత ముస్తాబు చేసుకుంటున్నాయి. క్రీడాకారులు క్రీడామైదానాల వద్ద సులభంగా దిగడం కోసం ఎక్కడం కోసం అతి వేగంగా నడిచే బుల్లెట్‌ రైళ్లతోపాటు నెమ్మదిగా నడిచే బుల్లెట్‌ రైళ్లును కూడా ప్రవేశపెడుతున్నారు. 

మరిన్ని వార్తలు