మాపై గుడ్డిగా దాడి చేశారు!

22 Mar, 2016 17:04 IST|Sakshi

బ్రస్సెల్స్: తాము భయపడినట్టే జరిగిందని, తమపై గుడ్డిగా దాడి చేశారని బెల్జియం ప్రధానమంత్రి చార్లెస్ మైఖేల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి ఇది చీకటి గడియ అని, ఈ సమయంలో సంయమనంతో, ఐక్యతతో ఉండాల్సిన అవసరముందని ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు. పిరికిపందల్లా తమపై దాడికి దిగారని ఉగ్రవాదులను ఉద్దేశించి ఆయన అన్నారు. ప్రస్తుతం ఆర్మీ పూర్తిస్తాయిలో రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నదని చెప్పారు.

బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో మంగళవారం జరిగిన వరుస ఆత్మాహుతి దాడుల్లో 21మందికిపైగా చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 55 మంది గాయపడ్డారు. బ్రసెల్స్ లోని విమానాశ్రయంతోపాటు ఓ మెట్రో స్టేషన్ వద్ద కూడా పేలుళ్లు జరిగాయి. పారిస్ నరమేధం నిందితుడిని బెల్జియంలో ఇటీవల అరెస్టు చేసిన  నేపథ్యంలో జరిగిన ఈ ఉగ్రవాద దాడితో బ్రసెల్స్ చిగురుటాకులా వణికిపోయింది. బెల్జియం దిగ్భ్రాంతపోయింది. ఈ నేపథ్యంలో పేలుళ్లలో చనిపోయినవారి కుటుంబాలకు బెల్జియం ప్రధాని చార్లెస్ మైఖేల్ సంతాపం తెలిపారు. ఈ పేలుళ్లలో పలువురు చనిపోయినట్టు, పెద్దసంఖ్యలో ప్రజలు క్షతగాత్రులైనట్టు తెలుస్తున్నదని ఆయన పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు