సముద్రలోతుల అంతు చూస్తాం...!

24 May, 2018 23:59 IST|Sakshi

2030 కల్లా సాగరాల ‘మిస్టరీ’ చేధిస్తామంటున్న  శాస్త్రవేత్తలు...

ప్రస్తుతం అత్యాధునిక శాస్త్ర,సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. రోజుకు రోజుకు నూతన ఆవిష్కరణలు వెలుగుచూస్తున్నాయి. అయినప్పటికీ ఈ సువిశాల విశ్వంలో ఇంకా ఎన్నో రహస్యాలు తెరమరుగునే ఉండిపోతున్నాయి. చందమామ ఉపరితలం  ఎలా ఉంటుంది? కుజ గ్రహంపై ఏముంటుంది ? అన్న విషయాల గురించి తెలుసు కాని సముద్రగర్భంలో ఏమేమి నిక్షిప్తమై ఉన్నాయి ? వాటి వల్ల మనకు కలిగే ప్రయోజనాలపై ఇంకా పూర్తిస్థాయి అవగాహన సాధించలేకపోయాము.

ప్రపంచవ్యాప్తంగా కొన్ని సముద్రాల అడుగున ఏముందన్నది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. 21వ శతాబ్దంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురుకావడమేంటీ అన్న ప్రశ్నల నుంచే ‘ద సీ బెడ్‌ 2030 ప్రాజెక్టు’ రూపుదిద్దుకుంది. వివిధ ఖండాల మీదుగా ఉన్న సముద్రగర్భాన్నంతా  2030 కల్లా ‘మ్యాపింగ్‌’ చేయాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం.  సముద్రం ద్వారా 2030 కల్లా  ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నేరుగా  3 ట్రిలియన్‌ డాలర్ల ఆదాయం  (2010లో 1.5 ట్రిలియన్‌ డాలర్లు) చేకూరుతుందని ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ అంచనా. 2021–30 సంవత్సరాల మధ్యనున్న  కాలాన్ని ‘ఓషియన్‌ సైన్స్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌’గా ఐరాస తీర్మానించిన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. 

దీని వెనక ఎవరు ?
జపాన్‌కు చెందిన దాతృత్వసంస్థ ‘నిపాన్‌ ఫౌండేషన్, ఐరాస సాంస్కృతిక సంస్థ యునెస్కో, ఇంటర్నేషనల్‌ హైడ్రోగ్రాఫిక్‌ ఆర్గనైజేషన్‌ల కింద పనిచేసే జిబ్‌కో (లాభాపేక్ష లేని నిపుణుల సంఘం–సముద్రం అడుగున ఏముందని అన్వేషణలు సాగిస్తున్న సంస్థ) సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ఏర్పడింది. భారత సంతతికి చెందిన కెనడా పౌరుడు సతీంతర్‌ బింద్రా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఏం చేస్తారు ?

  • ప్రపంచవ్యాప్తంగా  నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. వాటిలోని  నిపుణులు, పరిశోధకులు ఇప్పటికే విభిన్నరూపాల్లో అందుబాటులో ఉన్న  వివరాలు, సమాచారాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత ఆ సమాచారాన్నంతటిని బ్రిటన్‌లోని నేషనల్‌ ఓషియనోగ్రఫీ సెంటర్‌లో ఆయా అంశాలను  క్షుణ్ణంగా పరీక్షించి ఒకచోట చేరుస్తారు.
  • వాణిజ్యనౌకలు, చేపలు పట్టే మర పడవలు, అండర్‌వాటర్‌ డ్రోన్ల ద్వారా ఇప్పటికే సేకరించిన వివరాలు, సమాచారంతో పాటు సముద్ర పరిశోధకులు నిగ్గుతేల్చిన అంశాలను ఒకచోట చేరుస్తారు
  • వివిధ రూపాల్లో ఇప్పటికే వెల్లడైన విషయాలతో పాటు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో మునిగిపోయిన నౌకలపై సముద్ర అన్వేషకులు జరిపిన పరిశోధనాంశాలు, వాణిజ్య,వ్యాపార కంపెనీల వద్ద ఉన్న సమాచారాన్ని కూడా తీసుకుంటారు
  • 2014లో మలేషియా ఎయిర్‌లైన్స్‌ ఎమ్మెచ్‌ 370 విమాన ప్రమాదం నేపథ్యంలో డచ్‌ దేశానికి చెందిన ఫుగ్రో సంస్థ 65 వేల కి,మీ మేర సముద్ర అడుగుభాగాన్ని జల్లెడ పట్టింది. ఈ సందర్భంగా జరిపిన పరిశోధన వివరాలు కూడా ఇందులో జతచేస్తారు
  • మలేషియా విమానం ఆచూకీ కనుక్కునేందుకు పనిచేస్తున్న ఓషియన్‌ ఇనిఫినిటీ సంస్థ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యింది. 
  • ఎందుకోసం ?
  • సునామీ సంభవించినపుడు అలల ఉధృతి, పయనించే గమనం ఎలా ఉండబోతుందో అంచనా వేయడం
  • మత్స్యసంపద  కదలికలు ఎటునుంచి ఎటు ఉంటాయో కనిపెడతారు
  • కాలుష్యం ఏ మేరకు వ్యాపించింది, దానిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి
  • సముద్రగర్భంలో నిగూఢంగా ఉండిపోయిన ఖనిజ నిక్షోపాల గుట్టు తేలుస్తారు
  • నౌకలు, ఓడల గమనం, రవాణా దారులు కనుక్కుంటారు

ఎంత ఖర్చవుతుంది ?

  • ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 300 కోట్ల డాలర్లు ఖర్చవుతుందని అంచనా. 

-సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌


 

మరిన్ని వార్తలు