వెబ్‌క్యామ్ ముందు ఏడ్వండి!

1 Dec, 2015 18:46 IST|Sakshi
వెబ్‌క్యామ్ ముందు ఏడ్వండి!

పారిస్: నవ్వు నాలుగు విధాల చేటంటారు పెద్దలు. మరి ఏడ్వడం? ఏడిస్తే...ముఖ్యంగా వెక్కి వెక్కి ఏడిస్తే  గుండెలో గూడుకట్టుకున్న విషాదం తొలగిపోతుందట. హృదయం తేలిక పడుతుందట. ఒంటరి తనం దూరమవుతుందట. తనువు తాపం తీరిపోతుందట. శరీరంలో కొత్త శక్తి పుట్టుకొచ్చి నూతనోత్సాహం కలుగుతుందట. ఇదీ పారిస్‌కు చెందిన ఓ యువ కళాకారిణి డోరా మౌటోట్ ఫిలాసఫీ. గత కొంతకాలంగా ఒంటరితనాన్ని భరించలేక కంప్యూటర్ వెబ్‌క్యామ్ ముందు పదే పదే ఏడ్చిన  డోరా ఇప్పుడు తన కన్నీళ్లను ప్రపంచంతో పంచుకోవడానికి ‘వెబ్‌క్యామ్ టియర్స్’ పేరిట ఏకంగా ఓ ప్రాజెక్ట్‌నే చేపట్టింది.

 ‘నా కన్నీళ్లను షేర్ చేసుకోవడానికి మీరు కూడా వెబ్‌క్యామ్ ముందు ఒంటరిగా ఏడ్వండి. ఇదేమి నా పిచ్చి కాదు. ఈ సమాజంలో ఏడ్వడానికి ఎందుకు సిగ్గుపడతారు? ఏడ్వడం బలహీనతకు గుర్తనుకుంటున్నారా? అదేమి కాదు. ఈ ప్రపంచంతో మీ కన్నీళ్లను పంచుకోండి. ఆ వీడియో క్లిప్‌లను నాకు పంపించండి’ అని ఆమె ఫేస్‌బుక్, టంబ్లర్ పేజీల్లో పిలుపునిచ్చింది. అంతే సోషల్ వెబ్‌సైట్‌లో ఏడ్వడం అనే కొత్త ట్రెండ్ మొదలైంది. ఇప్పటికే ఆమెకు ఏడ్చే వీడియోలు దాదాపు వంద వచ్చాయట. అలా వచ్చిన వీడియోల క్లిప్పులన్నింటినీ ఓ చోట చేర్చి మళ్లీ సోషల్ మీడియాకు చూపిస్తుందట.

 ‘ 365 డేస్: ఏ కాటలాగ్ ఆఫ్ టియర్స్’ పేరిట ఏడాది పాటు తన విషాదాన్ని వెళ్లలగక్కిన లారెల్ నకాడేట్ అనే ఆర్టిస్ట్‌ను స్ఫూర్తిగా తీసుకొని తానీ ప్రాజెక్ట్‌ను చేపట్టానని, వెబ్‌సైట్లలో జననాంగాలను చూసి ఆశ్చర్యపడే రోజులు పోయాయని, ఇకముందు టియర్స్ కూడా కొత్తరకం పోర్నోగ్రఫీ అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు