తాగి కారు నడిపినా తప్పు కాదట!

14 May, 2016 15:59 IST|Sakshi
తాగి కారు నడిపినా తప్పు కాదట!

డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాలు సంభవిస్తాయన్న విషయం ప్రతి వారికీ తెలిసినదే. అందుకే ఆయా ప్రాంతాలను బట్టి భద్రతాధికారులు కొన్ని నిబంధనలను విధిస్తుంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో అవలంబిస్తున్న విధానాలను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వారు వేసే శిక్షలు, జరిమానాలూ కూడ భయంకరంగా ఉండటం కనిపిస్తుంది. కొన్ని దేశాల్లో కార్లను ఆదివారం కడగడమే తప్పయితే... కొన్ని చోట్ల మద్యం సేవిస్తూ కారు నడిపినా తప్పు లేదట.

ప్రపంచవ్యాప్తంగా కనిపించే నియమాల్లో వింతగా కనిపించే నిబంధన బీజింగ్ లో కనిపిస్తుంది. జీబ్రా క్రాసింగ్ దగ్గర బాటసారులు రోడ్లు దాటేప్పుడు ఒకవేళ సిగ్నల్ పడిందంటే వారి పని అంతే. ప్రమాదం జరుగుతుందని తెలిసినా కారు నడిపే వారు మాత్రం మనుషులు అడ్డొచ్చినా, ప్రాణాలు పోయినా వాహనాలు ఆపకూడదట. అలాగే కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా అవలంబిస్తున్నసరిబేసి విధానం చాలా దేశాల్లోనే కనిపిస్తుంది. ముఖ్యంగా స్పానిష్ దేశాల్లో రోడ్లమీద కార్లు పార్క్ చేయడంలో సరి బేసి విధానం అమలవుతోంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కారు పార్క్ చేయకపోతే భారీ జరిమానాలు పడటం ఖాయం. ముఖ్యంగా ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించడంకోసం, రోడ్డు మార్గం సరిగా కనిపించడం కోసం చీకటి సమయంలో వాహనాల లైట్లను వేస్తాం.

అయితే స్వీడన్ లో మాత్రం పగలు కూడ వాహనాలు నడిపేవారు లైట్లను ఆపకూడదట. ప్రయాణంలో లైట్లు వెలగని పక్షంలో శిక్షను భరించాల్సిందే. ఈ వింత నియమం ఎందుకు అవలంబిస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. అలాగే థాయ్ ల్యాండ్ లో బట్టలు సరిగా వేసుకోకుండా కార్లు, బైక్ లు నడపడం నిషేధం స్త్రీ పురుషుల్లో ఎవరైనా సరే... నిబంధనను అతిక్రమించారంటే భారీ జరిమానా కట్టాల్సిందే. ఇక రష్యాలో అయితే మట్టికొట్టుకుపోయిన వాహనాలు రోడ్లపైకి తేవడం తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ఇండియాలో బాటసారులు ఎలా పోయినా ఫర్వాలేదంటూ వర్షంలోనూ ఏమాత్రం స్పీడు తగ్గకుండా వాహనాలు నడిపించడం, పక్కవారిపై బుదర చల్లడం కనిపిస్తే... జపాన్ దాన్ని తీవ్ర నేరంగా పరిగణించి భారీ జరిమానా విధిస్తుంది. వీటన్నింటికీ భిన్నంగా జార్జియాలోని మెరియట్టా నగరంలో కార్లలో వెళ్ళేవారు ఏమాత్రం ఉమ్మి వేయకూడదట. ఇది బాగానే ఉంది. పరిశుభ్రతకోసం ఈ పద్ధతి పాటిస్తున్నారు అనుకోవచ్చు. కానీ అక్కడే ట్రాక్టర్లలో వెళ్ళేవారు మాత్రం ఉమ్మొచ్చు అన్న పద్ధతి కూడ అవలంబించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. స్విర్జర్లాండ్లో ఆదివారాలు కార్లు కడగకూడదన్న రూలు అమల్లో ఉంటే..డెనివర్ ప్రాంతంలో ఆదివారాలు నల్లకార్లు రోడ్డెక్క కూడదని, అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో కురుచ దుస్తులు వేసుకొని వాహనాలు కడగ కూడదని ఇలా వింత వింత నిబంధనలు కనిపిస్తుంటాయి.

ముఖ్యంగా ఇండియాలో మద్యం సేవించి కారు నడపడం నేరం అయితే... కోస్తారికాలో మద్యం తాగుతూ కూడ వాహనం నడపొచ్చన్న విషయం నిజంగా వింతగానే కనిపిస్తుంది. ఇక ఇటలీలో మాత్రం కారునడిపేప్పుడు ముద్దు పెట్టుకోవడం నిషేధం. ఒకవేళ అటువంటి దృశ్యం పోలీసుల కంట పడిందో సుమారు ఏభై వేల రూపాయల వరకూ భారీ జరిమానా చెల్లించాల్సిందే. అలాగే కళ్ళకు గంతలు కట్టుకొని కార్టు నడిపినా ప్రమాదం లేదంటారు అమెరికా అలబామా వాసులు. మరి అటువంటప్పుడు ప్రమాదాలను ఎలా నివారిస్తారన్న విషయం వారికే తెలియాలి. ముఖ్యంగా సౌదీలో ఆడవార్లు కార్లు నడపకూడదన్న నిబంధన కనిపిస్తుంది. అది అతిక్రమిస్తే కఠిన శిక్షలను సైతం ఎదుర్కోవాల్సి రావడం కొంత బాధాకరంగా కూడ ఉంటుంది.

మరిన్ని వార్తలు