బాసు.. చూపించింది యమ క్రేజు

20 Feb, 2020 08:50 IST|Sakshi

ఆఫీసులో బాసు వస్తున్నాడంటే చాలు.. గజగజ వణికిపోతుంటారు కొంతమంది. తన వంటి పనిమంతుడు ప్రపంచంలోనే ఎవరూ లేరన్నట్లుగా కంప్యూటర్‌ ముందు ఫోజులు కొడుతుంటారు మరికొంతమంది. కానీ ఈ లేడీ బాస్‌ వస్తుందంటే అక్కడ పనిచేసే ఉద్యోగులు సంతోషంగా చిరునవ్వుతో స్వాగతం పలుకుతారు. ఉత్సాహంగా పని చేస్తారు. ఎందుకో మీరే చదివేయండి.. వెల్‌స్పన్‌ ఇండియా కంపెనీ సీఈవో దీపాళి గోయెంకా ఆఫీసులోకి రాగానే సరాసరి తన చాంబర్‌లోకి వెళ్లలేదు. ఉద్యోగుల క్యాబిన్‌ దగ్గర ఆగిపోయారు. వారిని నవ్వుతూ పలకరించడమే కాదు.. ‘ముక్కాలా.. ముఖాబులా’ అంటూ డ్యాన్స్‌ చేసి ఉద్యోగుల్లో జోష్‌ నింపారు. దీంతో మిగతా వారు సైతం ఆనందంతో ఆమెతో కాలు కదుపుతూ రిలీఫ్‌ అయ్యారు. ఈ వీడియోను ఆర్పీజీ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ హర్ష్‌ గోయంకా మంగళవారం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. (లాస్ట్‌ స్టెప్పు ఉంది చూడు.. అది పీక్స్‌ అసలు)

‘ఆఫీసులో సీఈవో డ్యాన్స్‌ చేయడం అనేది చాలా అరుదు’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు సీఈవో గోయెంకా కృతజ్ఞతలు తెలుపుతూ రిప్లై ఇచ్చారు. ‘మీ ఆఫీసు కూడా ఇలా సంతోషంగా ఉంటే చూడాలనుంద’ని పేర్కొన్నారు. ఇక ఈ లేడీ బాస్‌ను కొందరు మెచ్చుకుంటుంటే మరికొందరు మాత్రం మాకు ఇలాంటి బాస్‌ ఉంటే బాగుండునని ఈర్ష్య పడుతున్నారు. ఇక ఈ వీడియోను గోయెంకా తిరిగి షేర్‌ చేస్తూ పారిశ్రామిక దిగ్గజాలైన ఆనంద్‌ మహీంద్రా, గౌతమ్‌ అదానీ, కిరణ్‌ మజుందార్‌ షాలను ట్యాగ్‌ చేశారు. ‘నా ఆఫీసులో ఇంత స్వేచ్ఛ ఉంటుంది. మరి మీ ఆఫీసులో?’ అంటూ సరదాగా ప్రశ్నించారు. మరి ఈ బిజినెస్‌ బాస్‌లు ఏమని స్పందిస్తారో చూడాలి!

మరిన్ని వార్తలు