బ్రిటన్‌ పార్లమెంటు వద్ద ఉగ్ర కలకలం

14 Aug, 2018 14:46 IST|Sakshi
స్కాట్‌లాండ్‌ యార్డ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన కారు డ్రైవర్‌

లండన్‌: బ్రిటన్‌ పార్లమెంటు భద్రత కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను మంగళవారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం) ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టడంతోపాటు ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద సైకిళ్లపై నిరీక్షిస్తున్న ముగ్గురిని గాయపరిచాడు. దీనిని ఉగ్రచర్యగా పరిగణిస్తున్నామని పోలీసులు తెలిపారు. అతణ్ని అరెస్టు చేసి విచారిస్తున్నామనీ, లండన్‌ సహా బ్రిటన్‌లో తదుపరి ఉగ్రవాదులు దాడులు చేయొచ్చన్న నిఘా సమాచారమేదీ లేదని పోలీసులు తెలిపారు.

‘కారులో ఆ ఉగ్రవాది మినహా మరెవ్వరూ లేరు. ఉగ్రవాది వద్ద, కారులోనూ ఎలాంటి ఆయుధాలు లభించలేదు’ అని పోలీసులు చెప్పారు ఉగ్రవాది వయసు 25–30 మధ్య ఉండగా అతను ఎక్కడివాడో, పేరేంటో తెలియరాలేదన్నారు. లండన్‌ అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్, భారత సంతతి వ్యక్తి నీల్‌ బసు మాట్లాడుతూ ‘అతని గుర్తింపును, ఈ దాడి వెనుక ఉద్దేశాన్ని కనిపెట్టడమే మా తొలి ప్రాధాన్యం.

ప్రఖ్యాత ప్రదేశంలో ఈ ఘటన జరిగినందున దీనిని ఉగ్ర చర్యగా మేం పరిగణిస్తున్నాం’ అని చెప్పారు. పార్లమెంటు భవనం లోపలకు వెళ్లేందుకు ఉగ్రవాది ఈ చర్యకు పాల్పడి ఉండొచ్చని సమాచారం.  రోడ్లపై జనాలు బాగా రద్దీగా ఉండే సమయంలో ఈ ఘటన జరగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు పరిసర ప్రాంతాల్లోని రోడ్లను, వెస్ట్‌మినిస్టర్‌ ట్యూబ్‌ స్టేషన్‌ను మూసేశారు.

మరిన్ని వార్తలు