ఈ ఫొటో.. మనిషి మూర్ఖత్వానికి పరాకాష్ట!

5 Dec, 2019 11:13 IST|Sakshi

ఎడిన్‌బర్గ్‌: ప్లాస్టిక్‌ రక్కసికి మరో సముద్ర జీవి బలైంది. ప్రాణాలు కోల్పోయి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన భారీ తిమింగలాన్ని తరలించే వీల్లేక అక్కడే పాతిపెట్టారు. ఈ క్రమంలో తిమింగలం శరీరం నుంచి దాదాపు 100 కిలోల ప్లాస్టిక్‌ వస్తువులు బయటపడ్డాయి. ఈ విషాదకర ఘటన స్కాట్లాండ్‌లో చోటుచేసుకుంది. వివరాలు... స్థానిక హారిస్‌ బీచ్‌ ఒడ్డుకు దాదాపు 20 టన్నుల మగ తిమింగలం కొట్టుకువచ్చింది. దీనిని గమనించిన స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు బీచ్‌ వద్దకు చేరుకున్నారు.

అయితే దానిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించగా.. శరీరం నుంచి తాళ్లు, కప్పులు, బ్యాగులు, గ్లోవ్స్‌, చేపలు పట్టే వలలు, బాల్స్‌ వంటి దాదాపు క్వింటాళ్‌ ప్లాస్టిక్‌ వస్తువులు బయటపడ్డాయి. దీంతో తిమింగలాన్ని అక్కడే పాతిపెట్టారు. కాగా ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇది చాలా విషాదకర ఘటన. తిమింగలం కడుపులో కిలోల కొద్దీ చెత్త పేరుకుపోవడం చూస్తుంటే మనుషులు అసలు ఏం చేస్తున్నారో అర్థం కావడం’ లేదు అంటూ మండిపడుతున్నారు.

ఇక వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై స్పందించిన స్కాటిష్‌ సముద్ర జీవుల సంరక్షణ సంస్థ... ‘ సముద్ర కాలుష్యం వల్ల ఎన్నో జీవులు మృత్యువాత పడుతున్నాయి. భయంకరమైన ప్లాస్టిక్‌ వస్తువులు అరగించుకోలేక ప్రాణాలు విడుస్తున్నాయి. చెత్త వేయడం జంతుజాలాలకు ప్రమాదకరమని చెప్పినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు’  అని సోషల్‌ మీడియాలో పేర్కొంది. ఇది ప్రపంచ పర్యావరణ సమస్యగా పరిణమించినా మనుషుల ప్రవర్తనలో మార్పు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా తిమింగలానికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో... పర్యావరణ ప్రేమికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

‘మనిషి కార్యకలాపాల వల్లే ఇదంతా జరుగుతుంది. పంచ భూతాలను కలుషితం చేసి ప్రాణకోటిని ప్రమాదంలోకి నెడుతున్నాడు. మనిషి మూర్ఖత్వానికి ఇలాంటి ఫొటోలు పరాకాష్ట’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక యునైటెడ్ కింగ్‌డంలోని డోనా నూక్‌ నేచర్ రిజర్వులో అప్పుడే పుట్టిన ఓ సీల్‌ పప్‌(సముద్ర జీవి సీల్‌ పిల్ల) గాజు సీసాతో ఆడుకుంటున్న ఫొటో సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. నేచర్ ఫొటోగ్రాఫర్‌ డాన్‌ థర్లింగ్‌ రెండు వారాల క్రితం ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన సీల్‌ పప్‌ ఫొటో జంతుప్రేమికుల మనసును కలచి వేసింది.(చదవండి : ఈ ఫొటో మమ్మల్ని కలచివేసింది!)


 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా