ఇంటర్‌నెట్‌ను కుదిపేస్తోన్న ఫోటో..

9 Aug, 2018 17:24 IST|Sakshi

వాషింగ్టన్‌ : బిడ్డకు ఏమైనా అయితే తల్లి పడే వేదన అంతా ఇంతా కాదు. బిడ్డ తిరిగి మామూలు మనిషి అయ్యేదాకా తల్లి బిడ్డను వదిలి ఉండలేదు. ఒక వేళ ఆ బిడ్డ మరణిస్తే.. తల్లి కడుపుకోతను ఎవరు తీర్చలేరు. మాతృప్రేమ అంటేనే అలా ఉంటుంది. దీనికి మనుషులు, జంతువులు, జలచరాలు ఏవి అతీతం కావు. దీన్ని నిరూపించే ఓ రెండు సంఘటనలు వాషింగ్టన్‌లోని ఒలంపిక్‌ ద్వీపకల్పంలో చోటు చేసుకున్నాయి.

జే35 అనే 20 ఏళ్ల నీలి తిమింగలం రెండు వారాల క్రితం ఒక బిడ్డకు జన్మనిచ్చింది. కానీ తల్లి అయిన సంతోషం దానికి ఎంతో సేపు నిలవలేదు. ఎందుకంటే రెండు వారాలు గడిచేలోపు ఆ బిడ్డ మరణించింది. కానీ జే మాత్రం ఈ నిజాన్ని నమ్మలేకపోతుంది. తన బిడ్డ నిద్ర పోతుందనుకుందో ఏమో.. దాన్ని మేల్కోల్పడం కోసం వీపు మీద ఎక్కించుకుని ఆ ద్వీపకల్పం అంతా తిరుగుతుంది. కానీ ఆ బిడ్డ మాత్రం లేవడం లేదు. హృదయాన్ని కలచివేసే ఈ దృశ్యాన్ని మైల్‌స్టోన్‌ అనే ఎన్‌ఓఏఏ (జాతీయ మహాసముద్ర, వాతావరణ యంత్రాంగం) అధికారి ఒకరు గమనించారు. మరణించిన బిడ్డతో తిరుగుతున్న జే ఫోటోలను తీసి ఇంటర్నెట్‌లో షేర్‌ చేశారు. ఇప్పుడు ఈ ఫోటోల గురించి ప్రపంచవ్యాప్తంగా భావోద్వేగమైన చర్చ నడుస్తోంది.

ఇలాంటిదే మరో సంఘటన గురించి కూడా చెప్పారు మైల్‌స్టోన్‌. జే50 అనే నీలి తిమింగలం మూడున్నరేళ్ల చిన్నారికి జబ్బు చేసింది. మనుషులమైతే మన బాధను చెప్పుకోగలుగుతాం.. వైద్యం కూడా చేయించుకోగలుగుతాం. కానీ మూగ జీవాల పరిస్థితి అలా కాదు కదా. అవి తమ బాధను ఎవరితోను చెప్పుకోలేవు. పాపం జే పరిస్థితి కూడా అలానే ఉంది. ఏం చెయ్యాలో పాలుపోక బిడ్డను తనతో పాటే తిప్పుకుంటోంది. ఇది గమనించిన మైల్‌స్టోన్‌ సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ప్రసుత్తం వైద్యుల బృందం గాయపడిన జే50 బిడ్డకు వైద్యం చేయడం కోసం ద్వీపకల్పం అంతటా గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు