మొదటిదే.. చివరి ప్రయాణం! 

19 Apr, 2018 22:45 IST|Sakshi

అత్యంత విలాసవంతమైన భారీనౌక అది. ఎంతో మందిని తమతమ గమ్యస్థానాలనకు చేర్చేందుకు బయలుదేరింది. పడవలో... విందులు, వినోదాలు, కోలాహలంతో అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. సరైన సమాచారం.. సరైన చోటుకి పంపినప్పటికీ అది చేరాల్సిన  చోటుకి అందలేదు. ఇక అంతే ఒక్కసారిగా అల్లకల్లోలం రేగింది. ఎంతోమంది ప్రాణాలను మూటగట్టుకుని వెళ్లిపోయింది. అదేనండీ.. టైటానిక్‌ పడవ ప్రమాదం అని మీకిప్పటికే అర్థమైపోయిందనుకుంటా. టైటానిక్‌ పడవ తన మొదటి ప్రయాణంలోనే విషాదం చోటుచేసుకుంది. అ సంఘటన జరిగి గతవారమే 106 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా మరిన్ని విషయాలను తెలుసుకుందాం...!      

1912 ఏప్రిల్‌ 14 ఆదివారం రాత్రి చలికి దాదాపుగా గడ్డకట్టుకుపోయే ఉష్ణోగ్రత, సముద్రం నిశ్చలంగా ఉంది. చంద్రుడు జాడలేడు. ఆకాశం నిర్మలంగా ఉంది. మంచు కొండల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్న కెప్టెన్‌ స్మిత్‌ నౌకను దక్షిణం దిశగా మళ్లించమని సిబ్బందిని ఆదేశించాడు. ఆరోజు మధ్యాహ్నం 1:45 సమయానికి అమెరికా అనే స్టీమరు... టైటానిక్‌ నౌక వచ్చే దారిలో భారీ మంచు పర్వతాలు ఉండవచ్చునని చేసిన హెచ్చరికలు దురదృష్టవశాత్తూ నౌకను నియంత్రించే బ్రిడ్జ్‌ గదికి చేరలేదు. సాయంత్రం మెసాబా అనే నౌక నుంచి వచ్చిన అలాంటి హెచ్చరికలు సైతం కంట్రోల్‌ రూమ్‌కి చేరలేదు. రాత్రి 11:40 సమయంలో టైటానిక్‌ న్యూఫౌండ్‌ లాండ్స్‌ (ఉత్తర అమెరికాకు సమీపంలో ఉండే ఒక పెద్ద ద్వీపం)లో ప్రయాణిస్తోంది.

నౌక ముందు పయనిస్తూ సమాచారాన్ని అందిస్తూ హెచ్చరికలు చేస్తూ వెళ్లే ఫ్రెడెరిక్‌ ఫ్లీట్, రెజినాల్డ్‌ లీ పెద్ద మంచు పర్వతాన్ని గుర్తించారు. ఫ్లీట్‌ కుడి వైపు మంచుపర్వత ముందని చెప్తూ బ్రిడ్జి గదికి వెళ్లే గంటను మోగించాడు. నౌకాధికారి ముర్డోక్‌ నౌకను ఉన్నపళంగా ఎడమ వైపు మళ్లించమని ఆదేశించాడు. ఇంజన్‌ ఒక్కసారి ఆగిపోయి మళ్లీ తిరిగి పరిగెత్తడం ఆరంభించింది. అయినప్పటికీ నౌక పర్వతాన్ని గుద్దుకోవడం మాత్రం నివారించలేకపోయారు. ఈ ఘటనలో నౌక కుడిభాగం వైపు 300 అడుగుల పొడవు మేర రాపిడికి గురై నిర్మాణంలో వాడిన రివెట్ల(అతికించడానికి వేసే నట్లవంటి నిర్మాణాలు)ను పెకిలించింది.

కంపార్ట్‌మెంటుల్లోకీ చేరిన నీరు 
నౌక ముందుభాగం దెబ్బతినడంతో  మెల్లిగా పడవలోకి నీరు చేరడం మొదలైంది. నాలుగు కంపార్ట్‌మెంట్లు నీటితో నిండిపోయినా టైటానిక్‌ తేలిఉంది. కానీ ఐదో కంపార్ట్‌మెంట్‌లోకి కూడా నీరుచేరడం ప్రారంభమైంది. క్రమక్రమంగా పడవలోని పైన ఉండే కంపార్ట్‌ మెంట్లలోనూ నీరు చేరడం మొదలైంది. ప్రమాదాన్ని గుర్తించిన కెప్టెన్‌ స్మిత్‌ బ్రిడ్జ్‌ గదిలోకి వచ్చి నౌకను పూర్తిగా ఆపివేయమని ఆదేశించాడు. ఏప్రిల్‌ 15 అర్థరాత్రి తరువాత థామస్‌ ఆండ్రూస్, ఇతర నౌకాధికారులు పరీక్షించి లైఫ్‌ బోట్లను సమాయత్త పరచమని ఆదేశించారు. మొదటి లైఫ్‌ బోటు 12 మంది ప్రయాణికులతో కిందికి దించారు. టైటానిక్‌లో మొత్తం 1178 మందిని కాపాడగలిగే ఇరవై లైఫ్‌ బోట్లు ఉండేవి. ఇవి నౌకలోని మొత్తం సిబ్బంది, ప్రయాణికులకు సరిపోకపోయినా అప్పటి బ్రిటీష్‌ నియమాల ప్రకారం కావల్సిన దానికన్నా ఎక్కువ బోట్లే ఉన్నాయి. 

ఇతర నౌకలకు సమాచారం అందించినా... వైర్‌లెస్‌ ఆపరేటర్లు జాక్‌ ఫిలిప్స్, హరాల్డ్‌ బ్రైడ్‌  ప్రమాద విషయాన్ని  సమీప నౌకలకు చేరవేసాడు. ’’మౌంట్‌ టెంపుల్‌’’, ’’ఫ్రాంక్‌ఫర్ట్‌’’, టైటానిక్‌ సోదర నౌక ’’ఒలంపిక్‌’’ నౌకలకు సమాచారం అందింది. కానీ ఏ నౌకా సమయానికి దగ్గర్లో లేక పోయింది. 58 మైళ్ల దూరంలో ఉన్న కునార్డ్‌ లైన్స్‌కి చెందిన కర్పతియా నౌక ప్రమాదస్థలికి చేరుకొనేటప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ప్రయాణికులు, సిబ్బంది సహా 2224 మంది నౌకలో ఉండగా 1517 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. దీనికారణంగా ఆ నౌక భారీగా అపకీర్తిని మూటగట్టుకోవడమే కాకుండా, చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన సంఘటనలలో ఒకటిగా మిగిలిపోయింది. 

విలాసవంతమైన నౌక
టైటానిక్‌ నౌక వైట్‌ స్టార్‌ లైన్‌ అనే సంస్థ కోసం ఐర్లాండు లోని బెల్‌ఫాస్టు్క చెందిన హర్లాండ్‌ అండ్‌ వోల్ఫ్‌ అనే నౌకా నిర్మాణ సంస్థ తయారు చేసిన మూడు నౌకల్లో ఒకటి.  టైటానిక్‌ నిర్మాణం మార్చి 31, 1909లో అమెరికాకు చెందిన జేపీ మోర్గన్, ఇంటర్నేషనల్‌ మర్చంటైల్‌ మెరైన్‌ కంపెనీ సమకూర్చిన నిధులతో ఆరంభమై మార్చి 31, 1912కి పూర్తయింది. ఇది 269 మీటర్ల పొడవు, 28 మీటర్ల వెడల్పు ఉండేది. ప్రయాణికులు నౌకా సిబ్బంది మొత్తం కలిపి ఇది 3,547 మందిని మోయగలదు. నౌకలోనే ఈతకొలను, వ్యాయామశాల, టర్కిష్‌ బాత్, రెండు తరగతుల ప్రయాణికులకు గ్రంధాలయాలు, స్క్వాష్‌ కోర్టును కలిగి ఉండేది.  నౌకలో, ఆ కాలంలో అప్పుడే కొత్తగా అభివృద్ధి చెందిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడం జరిగింది.

– సాక్షి, స్టూడెంట్‌ ఎడిషన్‌

మరిన్ని వార్తలు