ఫేస్‌బుక్‌ వదిలేస్తే...!

3 Feb, 2019 02:17 IST|Sakshi

పొద్దున్న లేస్తూనే అద్దంలో మన ఫేస్‌ చూస్తామో లేదో కానీ ఫేస్‌బుక్‌ మాత్రం ఓపెన్‌ చేసి చూస్తాం.. అప్‌డేట్స్‌ అన్నీ ఆత్రుతగా చదివేస్తాం. అది లేకపోతే మనకి జీవితమే లేదని భ్రమల్లో బతికేస్తాం. అంతలా ఫేస్‌బుక్‌కి మనం బానిసలైపోయాం. నిజంగానే ఫేస్‌బుక్‌ అలవాటుని ప్రజలు మానుకోలేరా ? అది లేకుండా వాళ్లకు నిద్ర కూడా పట్టదా ? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి అమెరికాకు చెందిన స్టాన్‌ఫర్డ్, న్యూయార్క్‌ యూనివర్సిటీ (ఎన్‌వైయూ)లు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించాయి. గత ఏడాది అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు ముందు ఫేస్‌బుక్‌కి ఏడాది పాటు దూరంగా ఉంటే వెయ్యి నుంచి రెండు వేల డాలర్లు ఇస్తామంటూ ఎఫ్‌బీ వినియోగదారులకు సవాల్‌ విసిరాయి. డబ్బులకి ఆశపడో, సోషల్‌ మీడియాకు దూరంగా ఉండడమే మంచిదని భావించారో, కారణం ఏదైనా ఎందరో ఔత్సాహికులు ఈ సవాల్‌ స్వీకరించారు. మొత్తం 2,844 మంది ప్రయోగాత్మకంగా తమ ఫేస్‌బుక్‌ అకౌంట్లను నాలుగు వారాల పాటు డీ యాక్టివేట్‌ చేశారు. ఆ సమయంలో వారి నిత్య జీవితంలో ఎలాంటి అనూహ్య మార్పులు వచ్చాయో ఆ అధ్యయనం వెల్లడించింది. ఆ అధ్యయనం వివరాలను సోషల్‌ సైన్స్‌ రీసెర్చ్‌ నెట్‌వర్క్‌ ప్రచురించింది.

ఫేస్‌బుక్‌కి దూరంగా ఉంటే ఏం జరిగిందంటే .. 
- బంధు మిత్రులతో హాయిగా నవ్వుతూ తుళ్లుతూ సమయాన్ని గడిపారు.  
ఆన్‌లైన్‌లో ఇతర ఉపయోగకరమైన వెబ్‌సైట్లు చదివి పరిజ్ఞానాన్ని పెంచుకున్నారు.  
రోజుకి ఒక గంట సేపు ఖాళీ సమయం మిగిలింది 
రాజకీయపరమైన భావోద్వేగాలను నియంత్రించుకోగలిగారు 
నకిలీ వార్తలకు బదులుగా బయట ప్రపంచంలో జరుగుతున్న నిజాలు తెలుసుకొని నిష్పక్షపాతంగా ఆలోచించే నేర్పు వచ్చింది.  
మానసిక ఒత్తిడికి దూరమై జీవితం పట్ల ఓ రకమైన సంతృప్తి కలిగింది.  
పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, టీవీ చూడడం వంటి పాత అభిరుచుల వైపు మళ్లీ ఆసక్తి కలిగింది.  
నెలరోజుల పాటు దిగ్విజయంగా ఫేస్‌బుక్‌కి దూరంగా ఉన్న వారు, ఇక మీదట తాము ఫేస్‌బుక్‌ వినియోగాన్ని బాగా తగ్గిస్తామని చెప్పారు. ఆ సమయంలో ఇతర ఉపయోగకరమైన పనులు చేసుకుంటామని వెల్లడించారు.  

25–40 శాతం అలవాటు మానుకోలేకపోయారు 
సర్వేలో పాల్గొన్నవారిలో 25–40 శాతం మంది ఫేస్‌బుక్‌ అలవాటు మానుకోలేక మొదటి వారంలో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. దీంతో అధ్యయనకారులు వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సి వచ్చింది. అలా ఒత్తిడికి లోనైనవారందరినీ ఒకేచోటకి చేర్చి దేనికైనా బానిసలుగా మారడం మంచిది కాదంటూ పాఠాలు చెప్పాల్సి వచ్చింది. దీనిని బట్టి ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలు ప్రతీ మనిషి మెదడుపై ఎంతటి తీవ్రమైన వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తున్నాయో అర్థమవుతోందని అధ్యయనకారులు అంటున్నారు. ఫేస్‌బుక్‌ వినియోగం డ్రగ్స్‌ వాడకంతో సరిసమానమంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక నెలరోజుల పాటు ఫేస్‌బుక్‌ వైపు కూడా ముఖం చూడని వారిని మరో నెలరోజులు ఎఫ్‌బీకి దూరంగా ఉంటే మీకు ఎంత డబ్బులివ్వాలి అని అడిగితే వందలోపు డాలర్లు ఇచ్చినా సరే హాయిగా ఫేస్‌బుక్‌ని వదిలేస్తామంటూ సమాధానం ఇవ్వడం విశేషం. ఈ అధ్యయనంపై ఫేస్‌బుక్‌ అధికారి ఒకరు స్పందిస్తూ సర్వేల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతాయని అవే సరైనవని అనుకోవాల్సిన పనిలేదని అన్నారు. ఫేస్‌బుక్‌ వల్ల వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతోందని, వివిధ అంశాలపై లోతైన చర్చలు జరుగుతాయని, వాటిల్లో ఏది మంచో, ఏది చెడో గ్రహించే నేర్పు ఫేస్‌బుక్‌ వినియోగదారులకే ఉండాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు