రోబో శరణం గచ్ఛామి.. 

26 Feb, 2019 01:13 IST|Sakshi

ఈ రోబో ఏంటి.. దాని ముందు ఆ బౌద్ధమత సన్యాసులు అలా మోకరిల్లడమేమిటి? విషయం అర్థం కాలేదు కదూ.. చెబుతా వినండి మరి.. జపాన్‌లోని క్యోటోలో 400 ఏళ్లనాటి పురాతన బౌద్ధారామం ఒకటి ఉంది. పేరు.. కొడాయ్‌జి.. ఇప్పటి తరం.. ముఖ్యంగా యువతరానికి బౌద్ధమతం గొప్పతనాన్ని తెలియజేయడం ఎలా.. వారిని ఆకర్షించడం ఎలా.. అని ఆ మధ్య అక్కడి మత గురువులు బాగా ఆలోచించారు. పలు చర్చల అనంతరం టెక్నాలజీ సాయం తీసుకోవాలని నిర్ణయించారు. వెంటనే ఒసాకా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ ఇషిగురోను కలిశారు. అప్పుడు రెడీ అయింది .. ఈ రోబో సన్యాసి.. దీనికి దయకు ప్రతిరూపమైన దేవత ‘కెనాన్‌’పేరు పెట్టారు.

ఈ ఏఐ (కృత్రిమ మేథ) రోబో పనేమిమంటే.. బోధనలు చేయడమే.. తద్వారా యువతను ఆకర్షించడమే. 7 అడుగుల పొడవు.. 60 కిలోల బరువున్న ఈ రోబోకు అయిన ఖర్చు రూ.6.4 కోట్లు. రోబో బోధనలు ప్రస్తుత తరాన్ని ఆకర్షిస్తాయని.. వారి మనసుల్లోకి అవి చొచ్చుకుపోతాయని.. తద్వారా బౌద్ధమతం గొప్పదనాన్ని వారు తెలుసుకుంటారని మత గురువులు బలంగా నమ్ముతున్నారు. తాజాగా కెనాన్‌ చేసిన బోధనలకు వీరిలా ఫిదా అయిపోయారు. ప్రీ ప్రోగ్రామ్స్‌ సాయంతో జపనీస్‌తోపాటు చైనీస్, ఆంగ్ల భాషలోనూ అనర్గళంగా ఉపన్యసిస్తుందట. మార్చి నుంచి యువతతోపాటు వివిధ దేశాలనుంచి వచ్చే పర్యాటకులు లక్ష్యంగా కెనాన్‌ బోధనలుంటాయట.   

మరిన్ని వార్తలు