నాజీల ‘గాలి’ తీసేశారు..

29 Mar, 2018 03:41 IST|Sakshi

రెండో ప్రపంచ యుద్ధ కాలం.. అటువైపు.. అరివీర భయంకరమైన నాజీ సైన్యం.. ట్యాంకులు, తుపాకులతో గుంపులు గుంపులుగా.. అచ్చంగా.. బాహుబలి చిత్రంలోని కాలకేయుల్లాగా.. మరి ఇటువైపు..  కేవలం 1,100 మంది కళాకారులు.. వీరి వద్ద తుపాకులు లేవు.. ట్యాంకులు అసలే లేవు.. ఉన్నదల్లా.. సైకిల్‌ పంపులు.. కలర్‌ బాక్సులు.. సౌండ్‌ సిస్టమ్‌లు.. 

ఇదేమి చిత్రం.. ఇదేమి యుద్ధం.. 
ఇంతకీ గెలుపెవరిది? 
ఘోస్ట్‌ ఆర్మీ.. రెండో ప్రపంచ యుద్ధంలో వేల మంది అమెరికా, ఇతర మిత్ర దేశాల సైనికుల ప్రాణాలను కాపాడిన సైన్యం.. జర్మనీ సైనికులకు ‘సినిమా’చూపించిన మాయా సైన్యం.. ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేయడం కళాకారులకే సాధ్యం.. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా, మిత్ర దేశాలు దాన్నే తమ ఆయుధంగా మలుచుకున్నాయి. జర్మన్‌ సైనికులను మభ్యపెట్టడానికి ‘ఘోస్ట్‌ ఆర్మీ’ని సృష్టించాయి. అధికారికంగా దీన్ని 23వ హెడ్‌ క్వార్టర్స్‌ స్పెషల్‌ ట్రూప్స్‌గా పిలిచేవారు. ఇందులో పనిచేసేవారి నియామకమంతా రహస్యంగా జరిగింది. న్యూయార్క్, ఫిలడెల్ఫియా ఆర్ట్‌ స్కూల్స్‌ నుంచి తమకు కావాల్సిన వారిని ఎంపిక చేసుకున్నారు. వీరిలో మిమిక్రీ ఆర్టిస్ట్స్, చిత్రకారులు, సౌండ్‌ టెక్నీషియన్లు ఉన్నారు.  

ఇంతకీ వీరేం చేశారు 
జస్ట్‌ మాయ చేశారు.. అసలైన ట్యాంకర్లకు బదులుగా గాలితో నింపిన బెలూన్‌ టైపు ట్యాంకర్లను తయారుచేశారు. నిజమైన ఆయుధాలుగా భ్రమింపజేసేలా వాటికి రంగులు అద్దారు.. ట్యాంకులు, విమానాలు, శతఘ్నులు ఒకటేమిటి.. ఇలా అన్నీ ‘గాలి’ఆయుధాలను తయారుచేశారు. తమ సౌండ్‌ బాక్సులతో ఉన్నది వేయి మందైనా.. వేల మంది సైన్యం.. వందల సంఖ్యలో ట్యాంకర్లు వస్తున్న ఎఫెక్ట్‌ను సృష్టించారు. జర్మన్‌ సైనికులను లక్ష్యంగా చేసుకుని ఇలా మొత్తం 20 ఆపరేషన్లు చేశారు.. వీళ్ల పని ఒక్కటే.. సైనికుల దుస్తులు వేసుకుని.. అలా పరేడ్‌ చేసుకుని పోవడమే.. ముందే రికార్డు చేసిన.. ట్యాంకుల సౌండ్లు, వేలాది మంది సైనికుల పరేడ్‌ ఎఫెక్ట్‌ వంటి వాటిని భారీ స్పీకర్లతో వినిపించడమే.. అయితే.. ఈ నకిలీ ఆయుధాలు, సౌండ్‌ ఎఫెక్ట్‌ల వల్ల.. వందలాది ట్యాంకులతో వేలాది మంది సైనికులు తమ మీదకు దండెత్తి వస్తున్నారంటూ జర్మన్లు హడలిపోయేవారు.. ఉంటున్న స్థావరాలను విడిచి.. పారిపోయేవారు.. అంతేకాదు.. జర్మన్‌ గూఢచారులకు తెలిసేలా స్థానిక కాఫీ షాపుల్లో కూర్చుని.. వేల సంఖ్యలో అమెరికన్ల సైన్యం దండెత్తి వచ్చేస్తోందంటూ భయపెట్టించేలా మాట్లాడేవారు. ఇలా వీరు తమ గాలి సైన్యంతో వేలాది మంది అమెరికా, మిత్రదేశాల సైనికుల ప్రాణాలను కాపాడారు.. 

1945, మార్చి నెల.. 
ఘోస్ట్‌ ఆర్మీకి అసలైన పరీక్ష.. రైన్‌ నదిని దాటి.. జర్మనీలోకి ప్రవేశించాలని అమెరికా, మిత్ర దేశాల సైన్యాలు భావించాయి. జర్మన్‌ సైన్యాల దృష్టిని మళ్లించడానికి వెంటనే ఘోస్ట్‌ ఆర్మీని రప్పించాయి. దీంతో వారు ఇక తమ టాలెంట్‌ చూపించారు. 600 గాలి ట్యాంకులను రంగంలోకి దింపారు. వేల మంది సైనికుల పదఘట్టనల సౌండ్‌ ఎఫెక్ట్‌ను వినిపించారు. అంతే.. జర్మన్‌ సైన్యం దృష్టి.. ఈ రబ్బర్‌ సైన్యం మీదకు మళ్లింది.. అటు అమెరికా సైన్యాలు అతి తక్కువ ప్రతిఘటనతో విజయవంతంగా రైన్‌ నదిని దాటేశాయి. ఇక యుద్ధం ముగిసిన తర్వాత ఇందులో పనిచేసిన వారు తమతమ వృత్తుల్లోకి వెళ్లిపోయారు. వీరిలో పలువురు ఆయా రంగాల్లో పేరుప్రఖ్యాతులు కూడా సంపాదించారు. యుద్ధం ముగిసిన చాన్నాళ్ల వరకూ ఈ ఘోస్ట్‌ ఆర్మీకి సంబంధించిన వివరాలను రహస్యంగా ఉంచారు. ఆ పత్రాలు బయటకి రాలేదు. దాదాపు 40 ఏళ్ల తర్వాత వీరి గురించి ప్రపంచానికి తెలిసింది. నాటి 1100 మంది ఘోస్ట్‌ ఆర్మీలో ప్రస్తుతం ఓ 50 మంది బతికి ఉన్నారు. 2013లో తీసిన ది ఘోస్ట్‌ ఆర్మీ డాక్యుమెంటరీలో వీరిని ఇంటర్వ్యూ చేశారు 
కత్తి కన్నా కలం గొప్పదంటారు.. కానీ వీరంటారు.. కత్తి కన్నా మా ‘కళ’ గొప్పది అని..  
– సాక్షి, తెలంగాణ డెస్క్‌

మరిన్ని వార్తలు