త్వరలోనే భారత్‌లో వాట్సాప్‌పే..

31 Oct, 2019 11:22 IST|Sakshi

త్వరలోనే భారత్‌లో డిజిటల్‌ వ్యాలెట్‌ వాట్సాప్‌పేను లాంచ్‌ చేసేదిశగా ఫేస్‌బుక్‌ అడుగులు వేస్తోంది. ఈ మేరకు త్వరలోనే శుభవార్త అందిస్తామని ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ తెలిపారు. ఇప్పటికే దేశంలో వాట్సాప్‌ పే టెస్ట్‌రన్‌ విజయవంతమైంది. ఒక మిలియన్‌ యూజర్లు దీనిని ప్రయోగాత్మకంగా వినియోగించారు కూడా. అయితే, డాటా లోకలైజేషన్‌ నియమాలు, ఆర్బీఐ నిబంధనల కారణంగా వాట్సాప్‌ పే భారత్‌లో ఇంకా లాంచ్‌ కాకుండా ఆగిపోయింది. ‘ప్రస్తుతం భారత్‌లో దీనిని పరీక్షిస్తున్నాం. చాలామంది ప్రజలు దీనిని వాడుతున్నారు. త్వరలోనే భారత్‌లో దీనిని లాంచ్‌ చేస్తామని ఆశిస్తున్నా’ అని జుకర్‌బర్గ్‌ బుధవారం అనలిస్టులతో పేర్కొన్నారు.

యూపీఐ ఆధారిత వాట్సాప్‌ పే సర్వీస్‌ దేశంలోని 40 కోట్లమంది వాట్సాప్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. దీనిద్వారా చిన్న, మధ్యతరహా వ్యాపార లావాదేవీల్లో డిజిటల్‌ చెల్లింపులు మరింత పుంజుకుంటాయని భావిస్తున్నారు. అయితే, వాట్సాప్‌ పే ఫీచర్స్‌ స్థానిక డాటా నియమనిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో దీనిపై ఆర్బీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆర్బీఐ లోకలైజేషన్‌ డాటా నిబంధనలకు అనుగుణంగా స్టోర్‌ పేమెంట్స్‌ డాటాను దేశీయంగానే నిల్వ చేస్తామని వాట్సాప్‌ సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించినా.. ఆర్బీఐ మాత్రం వాట్సాప్‌ నిబంధనలను పూర్తిగా పాటించడం లేదని స్పష్టం చేయడంతో వాట్సాప్‌పే లాంచ్‌ భారత్‌లో ఆగిపోయింది.

>
మరిన్ని వార్తలు