ట్రంప్‌ ప్రమాణం రేపే

19 Jan, 2017 03:52 IST|Sakshi
ట్రంప్‌ ప్రమాణం రేపే

వైట్‌హౌస్‌ నుంచి ఒబామా బయటకు, ట్రంప్‌ లోపలికి
అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రేపు(జనవరి 20న) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమెరికా చట్టసభలకు నెలవైన క్యాపిటల్‌ భవనం(వాషింగ్టన్‌ డీసీ) మెట్లపై  ప్రమాణం చేసిన రోజే ఆయన అధికార నివాసం వైట్‌హౌస్‌లోకి కుటుంబసమేతంగా అడుగుపెట్టనున్నారు. ఆ రోజు ఉదయం అధ్యక్ష భవనంలోని తన పడకగదిలో నిద్రలేచే అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సాయంత్రానికి భార్యాపిల్లలతో కలసి నగరంలోని మరో భవనంలోకి వెళ్లిపోతారు. శుక్రవారం మధ్యాహ్నం ట్రంప్‌తో 45వ అధ్యక్షునిగా అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి  ప్రమాణం చేయిస్తారు. ట్రంప్‌కు ముందు ఉపాధ్యక్షునిగా మైకేల్‌ పెన్స్‌ ప్రమాణం ఉంటుంది. ప్రమాణాల తర్వాత ట్రంప్‌ తొలి ప్రసంగం చేస్తారు.

ఒబామాకు వీడ్కోలు : ఒబామా వీడ్కోలు కార్యక్రమం ముగిశాక, ట్రంప్‌ తొలిసారి అమెరికా కాంగ్రెస్‌ మధ్యాహ్న భోజన విందులో పాల్గొంటారు. తర్వాత అధ్యక్ష ప్రారంభోత్సవ పరేడ్‌లో పాల్గొంటారు. వెంటనే ప్రమాణం చేసిన ప్రదేశం క్యాపిటల్‌ నుంచి ట్రంప్‌ తన కాన్వాయ్‌తో పెన్సిల్వేనియా అవెన్యూ(క్యాపిటల్, వైట్‌హౌస్‌ను కలిపి మెయిన్‌రోడ్‌) గుండా  శ్వేతసౌధానికి చేరుకుంటారు.

20నే ప్రమాణం ఎందుకు?                                                                                       
లీప్‌ సంవత్సరం నవంబర్‌లో అమెరికా అధ్యక్షునిగాఎన్నికైన అభ్యర్థి జనవరి 20న ప్రమాణం చేసే సంప్రదాయం 1937లో ఆరంభమైంది. దేశ 32వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ రూజ్వెల్ట్‌  రెండోసారి 1936లో ఎన్నికయ్యాక జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు వరకూ మార్చి 4న(అమెరికా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు) కొత్త అధ్యక్షుడు ప్రమాణం చేయడం సంప్రదాయంగా 140 ఏళ్లు కొనసాగింది.  సాధారణంగా సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ కొత్త అధ్యక్షునితో ప్రమాణం చేయిస్తారు. ఒబామాతో రెండుసార్లూ(2009, 2013) అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్‌ రాబర్ట్స్‌ ప్రమాణం చేయించారు. ట్రంప్‌తో ఆయనే ప్రమాణం చేయిస్తారు.
ప్రమాణానికి బాలీవుడ్‌ డ్యాన్సర్లు
ముంబై: ప్రముఖ కొరియోగ్రాఫర్‌ సురేశ్‌ ముఖుద్‌ వద్ద శిక్షణ పొందిన దాదాపు 30 మంది భారత డ్యాన్సర్లు ట్రంప్‌ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రదర్శన ఇవ్వనున్నారు. వీరిలో చాలా మంది బాలీవుడ్‌కు చెందిన వారే. కొద్దిరోజుల క్రితమే వాషింగ్టన్‌లో మకాం వేసిన ముఖుద్‌ డ్యాన్స్‌ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. తాను కలలు కన్న అవకాశం ఇప్పుడు తనకు వచ్చిందని పేర్కొన్నారు.  

                                                                          
కాపిటల్‌ భవనం
70 ఏళ్ల వయసులో..: అధ్యక్షునిగా తొలిసారి ప్రమాణం చేసినప్పుడు ఎక్కువ వయసు ఉన్న నేతగా ఇప్పటి వరకూ రోనాల్డ్‌ రీగన్‌(69 ఏళ్ల 345 రోజులు) రికార్డుల్లో ఉన్నారు. రీగన్‌ రికార్డును జనవరి 20న ట్రంప్‌ బద్దలు గొట్టబోతున్నారు. ఆ రోజున ట్రంప్‌ వయసు 70 సంవత్సరాల, ఏడు నెలల, ఏడు రోజులు.

నాకు ట్వీటింగ్‌ ఇష్టముండదు: ట్రంప్‌
తనకు ట్వీటింగ్‌ ఇష్టముండదని, అయితే నిజాయితీ లేని మీడియాపై సోషల్‌ మీడియాలో పోరాడతానని ట్రంప్‌ చెప్పారు. ‘నిజాయితీ లేని మీడియా.. ప్రెస్‌ నా ముందు ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి ట్విటరే నాకున్న ఏకైక మార్గం’ అని ఓ ఇంటర్వూ్యలో అన్నారు.    
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

>
మరిన్ని వార్తలు