ఒంట్లో తేడా వస్తే ఇంట్లోకే వచ్చేస్తుంది!

27 Jun, 2017 07:07 IST|Sakshi
ఒంట్లో తేడా వస్తే ఇంట్లోకే వచ్చేస్తుంది!

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం.. అని ఓ సామెతుంది గుర్తుందా? ఆరోగ్యం విషయంలో మనందరికీ అచ్చుగుద్దినట్లు వర్తిస్తుంది ఇది. అనారోగ్యం రాకుండా చూసుకోవడానికి బదులు.. వచ్చేంతవరకూ గుర్తించకపోవడం.. రాగానే వైద్యుల వద్దకు పరుగులెత్తడం.. ఇదీ తంతు. ఈ పరిస్థితి మారితే ఎలా ఉంటుంది? ఇంట్లో మన దైనందిన కార్యక్రమాల్లో భాగంగానే వైద్య పరీక్షలూ జరిగిపోతూంటే! ఇంటి దగ్గరే మందులు దొరుకుతుంటే? భలే ఉంటుంది కదూ.. త్వరలోనే ఇవన్నీ వాస్తవ రూపం దాల్చనున్నాయి. నమ్మకం కుదరడం లేదా? పక్కనున్న ఫొటోలు చూడండి. సియాటెల్‌ కేంద్రంగా పనిచేస్తున్న డిజైన్‌ సంస్థ భవిష్యత్తు ఆరోగ్య సేవల కోసమని ఓ బ్రహ్మాండమైన ఐడియాను ముందుకు తెచ్చింది.

నెట్‌కు అనుసంధానమైన గాడ్జెట్లు.. స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను నేర్చుకునే కృత్రిమ మేధ వంటి అంశాలన్నీంటినీ ఒకదగ్గరకు చేర్చి పనిచేస్తుందీ కొత్త టెక్నాలజీ. చేతికి తొడుక్కునే యంత్రాలతో ఇప్పటికే మనం గుండె కొట్టుకునే వేగం మొదలుకొని, రక్తంలో చక్కెర మోతాదులు, బీపీ వంటి వివరాలు తెలుసుకుంటున్నాం కదా.. ఇలాంటి మరిన్ని గాడ్జెట్ల ద్వారా మన శారీరక వివరాలు ఎప్పటికప్పుడు తీసుకోవడంతో మొదలవుతుంది ఈ విధానం. సేకరించిన సమాచారాన్ని విశ్లేషించేందుకు స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌ ఉపయోగపడుతుంది. అనారోగ్య సూచనలేవైనా కనిపిస్తే.. ఆ వెంటనే చిన్న సైజు కారు మాదిరిగా కనిపిస్తున్న వాహనం మన ఇంటి వద్దకు వచ్చేస్తుంది. దాంట్లోకి చేరిపోతే.. అక్కడికక్కడ ఆటోమెటిక్‌గా మరిన్ని పరీక్షలు జరుగుతాయి.

అప్పటికప్పుడు మన డాక్టర్‌ వాహనంలోని స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాడు.. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టిన తరువాత ప్రిస్క్రిప్షన్‌ ఇచ్చేస్తాడు. అవసరాన్ని బట్టి అందులో కొన్నింటిని వాహనంలోనే అందేలా ఏర్పాట్లు ఉన్నాయి కూడా. అనారోగ్యం తీవ్రమైనదైతే.. ఆ కారులాంటి వాహనమే అంబులెస్స్‌ అవుతుంది. మనల్ని ఆసుపత్రికి చేరుస్తుంది. ఐడియా ఏదో బాగుంది కదా.. నిజమేగానీ... ప్రస్తుతానికి దీనికి బోలెడంత ఖర్చు అవుతుందట. టెక్నాలజీలు మరింత అభివృద్ధి చెందితే ఇలాంటివి అందుబాటులోకి వచ్చే అవకాశం లేకపోలేదు! – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

♦ ఒంట్లో బాగోలేకపోతే ముందు మన స్మార్ట్‌ఫోన్‌ కనిపెడుతుంది.. ఆ వెంటనే ఈ వాహనం ఇంటి ముందు వాలిపోతుంది.
♦ ఇంటికి వచ్చిన ఈ వాహనం... టెస్టులు చేస్తుంది, రిపోర్టులు ఇస్తుంది, అవసరమైతే అప్పటికప్పుడు అత్యవసర చికిత్స కూడా చేసేస్తుంది!

>
మరిన్ని వార్తలు