గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా ఎక్కడుంది?

12 Aug, 2018 03:29 IST|Sakshi

గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా ఎక్కడుంది అని మిమ్మల్ని ప్రశ్నిస్తే.. మీరేం సమాధానం ఇస్తారు? ఆ.. అదో ప్రశ్న.. దానికి మళ్లీ సమాధానం.. ప్రశ్నలోనే సమాధానం ఉంది కదా అని వెటకారంగా అంటూనే.. చైనా అని ఎవరైనా చెబుతారు. చిన్న పిల్లలను అడిగినా కూడా దాదాపు సమాధానం ఇచ్చేస్తారు. తెలియకపోయినా కూడా కనీసం ప్రశ్నలో ఉన్న చైనా పేరునైనా అలా గాలి వాటంగా సమాధానం ఇస్తారు. అయితే ఈ ఫొటోలో ఉన్న 26 ఆరేళ్ల యువతికి మాత్రం దానికి సమాధానం చెప్పడానికి రెండు లైఫ్‌లైన్లు తీసుకుందట! మన దగ్గర మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ఉంది కదా.. అచ్చు అలాంటిదే టర్కీలో కూడా నడుస్తోంది. అందులో పాల్గొనే అభ్యర్థులకు న్యాయనిర్ణేత పలు ప్రశ్నలు అడుగుతారు.. దానికి నిర్ణీత సమయంలో సమాధానం చెబితే డబ్బులిస్తారు.

అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న 26 ఏళ్ల సూ ఆయాన్‌ అనే యువతిని న్యాయనిర్ణేత ‘గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా ఎక్కడుంది?’ అని ప్రశ్న వేశారు. దానికి చైనా, భారత్, దక్షిణ కొరియా, జపాన్‌ అని నాలుగు ఆప్షన్లు కూడా ఇచ్చారు. అయితే సమాధానం తెలియక.. ఆమె ఆడియన్స్‌ పోల్‌ అనే లైఫ్‌ లైన్‌కు వెళ్లగా దురదృష్టం కొద్ది అక్కడి ఆడియన్స్‌లో కూడా 51 శాతం మంది మాత్రమే చైనాలో ఉందని చెప్పారట. దీంతో ‘ఫోన్‌ ఎ ఫ్రెండ్‌’ అనే లైఫ్‌ లైన్‌కు వెళ్లిందట. అదృష్టం ఏంటంటే ఆ ఫ్రెండ్‌కు సరైన సమాధానం తెలియడంతో తదుపరి ప్రశ్నకు వెళ్లింది. ఆ స్నేహితుడికి కూడా సమాధానం తెలియకపోతే పరిస్థితేంటో పాపం. అయితే ఆ తదుపరి ప్రశ్నకే తప్పు సమాధానం చెప్పి ఇంటి బాట పట్టింది ఆ యువతి. 

మరిన్ని వార్తలు