సముద్రం అడుగున తొలి హోటల్‌

5 Dec, 2019 18:05 IST|Sakshi

న్యూఢిల్లీ : పచ్చని చెట్లను కడుపులో పొదుపుకొని కనువిందు చేసే పర్వత పక్తుల మధ్య నుంచి నీటిపై పడవలో ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించడం ఎవరికైనా ఇష్టమే. మరి నీటి అడుగున ఇంద్ర ధనుస్సులా సప్త వర్ణాల్లో మెరిసిపోయే పగడపు దీవుల అందాలను తిలకిస్తే, చుట్టూ తిరిగే పలు రంగుల రకాల చేపలతోపాటు షార్కులు, తిమింగళాలు, ఇతర జల చరాలను ఎలాంటి అభద్రతా భావం లేకుండా కనులారా చూస్తుంటే ఆ అనుభూతి ఇంకెంత అందంగా ఉంటుంది? అది ఎలా సాధ్యం అవుతుంది?

అలాంటి ఔత్సాహికుల కోసమే ఆస్ట్రేలియాలో మొట్టమొదటి ‘అండర్‌ వాటర్‌ హోటల్‌’ను ఏర్పాటు చేశారు. క్వీన్స్‌లాండ్‌లో పది మిలియన్‌ డాలర్లు (దాదాపు 72 కోట్ల రూపాయలు) వెచ్చించి 14 నెలల్లో పూర్తి చేశారు. జల చరాలను ప్రత్యక్షంగా వీక్షించడం ద్వారా ‘కైమేట్‌ ఛేంజ్‌’ పట్ల ప్రజల్లో అవగాహనకు ఈ హోటల్‌ ఉపయోగపడుతుందన్న కారణంగా క్వీన్స్‌లాండ్‌ రాష్ట్ర ప్రభుత్వం 2.75 మిలియన్ల డాలర్ల ఆర్థిక సహాయంగా అందించింది.

ఏర్లీ బీచ్‌కు 39 నాటికల్స్‌ మైళ్ల దూరంలో సముద్రంలో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. దీని బరువు 260 టన్నులు. ఇందులో మొత్తం పది పడక గదులను నిర్మిస్తున్నారు. అందులో రెండు పడక గదులను డిసెంబర్‌ ఒకటవ తేదీ ఉంచి పర్యాటకుల కోసం ప్రారంభించారు. మిగతా గదులు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. నీటి అడుగునే కాకుండా నీటిపై డెక్‌ మీద టెంటులాంటి పడకల్లో కూడా సేదతీరే అదనపు సౌకర్యం ఉంది. టారిఫ్‌ల గురించి హోటల్‌ యాజమాన్యం ఇంకా వెల్లడించలేదు.

మరిన్ని వార్తలు