వేలమందిని కాపాడిన  ఆ డాక్టర్‌ ఇక లేరు

26 Sep, 2019 13:21 IST|Sakshi
డా. వాంగ్‌( ఫైల్‌ ఫోటో)

1990లో మధ్య చైనాలో హెచ్ఐవీ, హెపటైటిస్ మహమ్మారికి సంబంధించిన సంచలన విషయాన్ని బయటపెట్టిన సాహసోపేత డాక్టర్‌ షుపింగ్ వాంగ్‌ (59) కన్నుమూశారు. దాదాపు పదివేల మందికిపైగా ప్రాణాలను కాపాడిన ఆమె  ఇక సెలవంటూ ఈ ప్రపంచానికి శాశ్వత వీడ్కోలు పలికారు.  ఈమె స్ఫూర్తితో  రూపొందించిన నాటకం  ‘ది కింగ్‌ ఆఫ్‌ హెల్స్‌ ప్యాలెస్‌’ ప్రస్తుతం లండన్‌లో నడుస్తోంది.  నాటక రచయిత ఫ్రాన్సిస్‌ యో చూ.. వాంగ్‌ను "పబ్లిక్ హెల్త్ హీరో" అని పిలుస్తారు.

ఈ సందర్భంగా డా. వాంగ్‌ ప్రయాణం గురించి తెలుసుకోవాలి. 1991 లో చైనా ప్రావిన్స్ హెనాన్‌లో డాక్టర్ వాంగ్‌ ప్రభుత్వ రక్త, ప్లాస్మా సేకరణ కేంద్రంలో పనిచేసేవారు.  ఈ సందర్భంగా చాలా మంది  హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ బారిని పడిన వారు విచక్షణ రహితంగా రక్తాన్ని అమ్ముతున్నారని,  తద్వారా లక్షలమంది రక్త గ్రహీతలు ఈ భయంకరమైన వ్యాధుల బారిన పడుతున్నారని గుర్తించింది. వెంటనే తన సీనియర్‌ అధికారులను అప్రమత్తం చేసింది. దీనికితోడు పేలవమైన సేకరణ పద్ధతుల ద్వారా  పెనుప్రమాదం పొంచి వుందని హెచ్చరించింది. ఆమె చర్యలు వ్యాపారానికి ఆటంకం కలిగించాయని  వాదించిన సీనియర్లు బదిలీని బహుమానంగా ఇచ్చారు.  అయినా 1995లో, ఆమె మరో కుంభకోణాన్ని బయటపెట్టింది.  హైచ్‌ఐవీ పాజిటివ్‌ వ్యక్తి పలు  కేంద్రాల్లో రక్తాన్ని అమ్ముతున్నాడని  గుర్తించింది.  ఇదే విషయాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు  కూడా నివేదించింది.  ఫలితంగా ఉద్యోగాన్నికోల్పోయింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేసిన ఆమె భర్తను అతని సహచరులు బహిష్కరించారు. చివరికి ఇది వారి విడాకులకు దారి తీసింది.  దీంతో డాక్టర్‌ వాంగ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  హెనాన్ ప్రావిన్స్‌లో తనే స్వయంగా 400 శాంపిళ్లను సేకరించింది. ఖరీదైన పరీక్షలు నిర్వహించి,  హెచ్‌ఐవీ రేటు 13 శాతంగా ఉన్నట్టు గుర్తించారు. ఈ ఫలితాలను రాజధాని బీజింగ్‌లోని అధికారుల వద్దకు తీసుకువెళ్లారు.  కానీ ఈ సారి కూడా  ఆమెపై దాడి జరిగింది.  ఆమె క్లినిక్‌కు వచ్చి పరికరాలను ధ్వంసం చేశారు.

ఎట్టకేలకు  చైనా ప్రభుత్వం స్పందించింది. 1996లో దేశంలోని అన్ని రక్తం,  ప్లాస్మా సేకరణ కేంద్రాలు మూసివేసి దర్యాప్తు చేపట్టింది. అనంతరం ఆయా కేంద్రాల్లో దాతలందరికీ  హెచ్‌ఐవీ, హెపటైటిస్ సి స్క్రీనింగ్ చేయవలసి ఉంటుందని మంత్రిత్వ శాఖ తరువాత ప్రకటించింది.  చాలా సంవత్సరాల తరువాత, డాక్టర్ వాంగ్ గ్యారీ క్రిస్టెన్‌సెన్‌ను తిరిగి వివాహం చేసుకుని 2001లో సన్‌షైన్‌ అనే పేరుతో అమెరికా వెళ్లి పోయారు.  అక్కడ సాల్ట్ లేక్ సిటీలోని ఉటా విశ్వవిద్యాలయంలో వైద్య పరిశోధకురాలిగా పనిచేయడం ప్రారంభించారు.  

2001 సంవత్సరంలోనే మధ్య చైనాలో తీవ్రమైన ఎయిడ్స్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లు చైనా ప్రభుత్వం అంగీకరించింది. స్థానిక రక్త బ్యాంకుల ద్వారా లక్షలాదిమంది వ్యాధి బారిన పడ్డారని వెల్లడించింది. ముఖ్యంగా డాక్టర్ వాంగ్ పనిచేసిన ప్రావిన్స్ హెనాన్ ఎక్కువగా ప్రభావితం మైంది.  ఎయిడ్స్ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నవారిని చూసుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక క్లినిక్‌లను ఏర్పాటు చేసింది.

2019లో ఆమెను గతం వెంటాడింది. ఆమె జీవిత కథ ఆధారంగా రూపొందిన నాటక ప్రదర్శనను నిలువరించే ప్రయత్నాల్లోభాగంగా హునాన్‌లోని బంధువులు, స్నేహితులను కలవడానికివీల్లేదని, చైనా భద్రతా అధికారులు  బెదిరించారు.  వీటిని వాంగ్‌ ఏ మాత్రం  లెక్కచేయలేదు.  దీంతో  "ది కింగ్ ఆఫ్ హెల్స్ ప్యాలెస్" అనే నాటకం సెప్టెంబరులో లండన్లోని హాంప్‌స్టెడ్‌ థియేటర్లో ప్రదర్శించడం విశేషం.


నాటకంలోని  ఒక దృశ్యం

సెప్టెంబర్ 21 న సాల్ట్ లేక్ సిటీలో స్నేహితులు, ఆమె భర్తతో కలిసి  హైకింగ్‌ చేస్తుండగా డాక్టర్ వాంగ్ గుండెపోటుతో కన్నుమూశారు. మరణానికి ఒక నెల ముందు హాంప్‌స్టెడ్ థియేటర్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన వాంగ్‌ అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల ఉద్యోగం, వివాహం,ఆనందం అన్నీ కోల్పోయాను. కానీ తన పోరాటం ఏంతోమంది పేదలను రక్షించడానికి సహాయపడిందని సంతోషం వ్యక్తం చేశారు. ​ ఇంతలోనే ఆమె ఆకస్మిక మరణం ఆమె అభిమానుల్లో విషాదాన్ని నింపింది. 


నాటక రచయితతో డా. వాంగ్‌

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా