ఇకపై అతడికి వైట్‌హౌజ్‌లో ఎంట్రీ లేదు!

8 Nov, 2018 09:07 IST|Sakshi
మీడియా ప్రతినిధి జిమ్‌ అకోస్టా

వాషింగ్టన్‌ : అగ్రరాజ్యం అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు గట్టి షాక్‌ తగిలింది. బుధవారం వెల్లడైన ఫలితాల్లో డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధుల సభలో పైచేయి సాధించగా.. రిపబ్లికన్లు సెనేట్‌లో ఆధిపత్యం నిలుపుకొన్నారు. కాగా ఈ ఫలితాలతో కంగుతిన్న ట్రంప్‌ మరోసారి మీడియాను టార్గెట్‌ చేశారు. మీడియా తప్పుడు ప్రచారమే తమ ఓటమికి కారణమని పరోక్షంగా విమర్శించారు. ఈ క్రమంలో సీఎన్‌ఎన్‌ జర్నలిస్టు జిమ్‌ అకోస్టా ప్రెస్‌పాస్‌ను రద్దు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

అమెరికా మధ్యంతర ఎన్నికల పోలింగ్‌ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి సీఎన్‌ఎన్‌ రిపోర్టర్‌ జిమ్‌ అకోస్టా హాజరయ్యారు.  ఈ క్రమంలో వలసదారులపై ట్రంప్‌ అనుసరిస్తున్న విధానాలను ప్రస్తావిస్తూ.. ఇది ఒకరమైన దాడే కదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ట్రంప్‌.. ‘ నిజం చెప్పనా. అధ్యక్షుడిగా నేనేం చేయాలో నాకు తెలుసు. మీరు వార్తా సంస్థను సరిగ్గా నడిపించుకోండి. అలాగే రేటింగ్స్‌ను పెంచుకోండి’  అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో మరో ప్రశ్న అడిగేందుకు అకోస్టా సిద్ధమవుతుండగా.. ‘కూర్చో.. అతడి నుంచి మైక్రోఫోన్‌ లాక్కోండి’ అంటూ ట్రంప్‌ అసహనం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా.. ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం జిమ్‌ మరోసారి వైట్‌హౌజ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. ప్రెస్‌పాస్‌ రద్దు అయిన కారణంగా మిమ్మల్ని లోపలికి అనుమతించలేమని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఫ్యూచర్‌ నోటీసు అందేంత వరకు మరలా వైట్‌హౌజ్‌లో ప్రవేశించే వీలులేదని వైట్‌హౌజ్‌ వర్గాలు అతడికి సూచించాయి.
 

అసభ్యంగా ప్రవర్తించాడు.. అందుకే
‘అధ్యక్షుడు ట్రంప్‌ పత్రికా స్వేచ్ఛకు విలువనిస్తూ తన పాలన గురించి ఎదురయ్యే ఎన్నో కఠినమైన ప్రశ్నలకు సావధానంగా సమాధానమిస్తారు. కానీ ప్రెస్‌పాస్‌ పేరిట వైట్‌హౌజ్‌లో ప్రవేశించిన ఓ వ్యక్తి మా మహిళా ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తిస్తే మాత్రం ఉపేక్షించేది లేదు’ అని వైట్‌హౌజ్‌ ప్రతినిధి సారా సాండర్స్‌ ట్వీట్‌ చేశారు. కాగా ఇవన్నీ అబద్ధాలని, వారి తప్పులను ఎత్తిచూపిన కారణంగానే తనపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని అకోస్టా పేర్కొన్నారు. ఈ విషయంలో సాటి జర్నలిస్టులంతా ఆయనకు మద్దతుగా నిలిచారు.

మరిన్ని వార్తలు