అమెజాన్‌ అడవులు ఎలా అంటుకున్నాయి?

24 Aug, 2019 16:05 IST|Sakshi

ప్రపంచంలోనే అతి పెద్ద ఉష్ణమండల రెయిన్‌ ఫారెస్ట్‌గా గుర్తింపు పొందిన ‘అమెజాన్‌’ అడవులు ఇటీవల ఎందుకు తగులబడ్డాయి ? ప్రకృతి సిద్ధంగానే అవి అంటుకున్నాయా ? ఎవరైన వాటికి నిప్పంటించారా ? అందుకు కారణాలేమిటీ? బ్రెజిల్‌ వాయువ్య ప్రాంతం నుంచి పెరు, కొలంబియా, వెనిజులా, ఈక్వెడార్, బొలీవియా, గయానా, ఫ్రాన్స్‌ వరకు లక్షలాది కిలోమీటర్ల వరకు అమెజాన్‌ అడవులు విస్తరించి ఉన్నాయి. ఎప్పటిలాగా ఈసారి కూడా బ్రెజిల్‌ దేశం పరిధిలోని అమెజాన్‌ అడవులే అంటుకున్నాయి. ముందుగా ఈ మంటలు చిన్నవనుకున్నారు. సావో పాలో నగరమంతా మిట్టమధ్యాహ్నమే దట్టమైన పొగలు కమ్మడంతో అడవులు తీవ్రంగా మండుతున్నాయని భావించారు. 

‘ప్రేఫర్‌అమెజాన్స్‌’ అనే హాష్‌ట్యాగ్‌తో రెండు రోజుల్లోనే సోషల్‌ మీడియాలో మూడు లక్షలకు పైగా ట్వీట్ల వర్షం కురిసింది. అడవులు భయంకరంగా మండుతున్న 15, 20 ఏళ్ల క్రితం నాటి వీడియోలు, ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ అయ్యాయి. ఆగస్టు 19, 20వ తేదీల నాటికి ఓ మోస్తారుగా బ్రెజిల్‌లోని అమెజాన్‌ అడవులు అంటుకున్నాయి. సహజంగా అంటుకునే లక్షణం అమెజాన్‌ అడవులకు లేవు. ఈ అడవి ప్రాంతాల్లో పది మున్సిపాలిటీ నగరాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో అడవుల నరికివేత ఎక్కువగా జరిగింది. అక్కడ దాదాపు 43 శాతం అటవి అంతరించిపోయిందని, ఫలితంగా 375 హాట్‌బెడ్‌ ప్రాంతాలను గుర్తించామని ‘ఐపామ్‌ అమెజాన్‌ రిసర్చ్‌ సెంటర్‌’ తెలియజేసింది. ఆ ప్రాంతాల్లో మానవులు వంట చెరకు మండించడం, ఉద్దేశపూర్వకంగా తగులబెట్టడం వల్లగానీ మంటలు చెలరేగి అడవి లోపలికి విస్తరిస్తాయి. 

చదవండి: మంటల్లో ‘అమెజాన్‌’; విరాళాలు ఇవ్వండి!

అటవీ ప్రాంతాల్లో పశువుల యజమానులు తమ పశువుల గ్రాసం కోసం కొన్ని విలువైన చెట్లను నరికివేసి, తర్వాత కొన్ని మిగతా చెట్లను తగలబెడతారు. ఆ తగలబడిన చెట్ల బూడిద మట్టిలో కలవడం వల్ల పచ్చగడ్డి ఏపుగా పెరుగుతుందట. అది పశువులకు గ్రాసంగా ఉపయోగపడుతుందట. తాత్కాలికంగా ఆ మట్టిలో గడ్డి పెరిగినా, ఆ తర్వాత భూమిలో సారం క్షీణుస్తుందట. పశువుల యజమానులే సహజంగా ఇలా అడవిలోని చెట్లను తగులబెడతారని, ఈసారి కూడా అదే జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు ‘ఐపామ్‌’ రిసర్చ్‌ సెంటర్‌ వర్గాలు తెలిపాయి. 

బ్రెజిల్‌ ప్రాంతంలో ఇప్పటికీ 57 శాతం అడవి అంతరించిపోయినట్లు బ్రెజిల్‌ జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం గుర్తించినప్పటికీ అక్కడి ప్రభుత్వం అడవులు పరిరక్షణకు అంతగా చర్యలు తీసుకోవడం లేదు. 2012 నుంచి అడవుల నరికివేత అక్కడ తీవ్రమైంది. ఇప్పటి వరకు 4,571 చదరపు కిలోమీటర్ల మేర అటవి పూర్తిగా అంతరించి పోయింది. ఆగస్టు 22వ తేదీ నాటికి మంటలు పూర్తిగా ఆరిపోయినట్లు ‘ప్లానెట్‌’ అనే శాటిలైట్‌ కంపెనీ ఛాయా చిత్రాలు స్పష్టం చేస్తున్నారు.అమెజాన్‌ అడవులు అంటుకున్నప్పుడు ప్రభుత్వంకన్నా ముందు ఆ ఆడవుల్లో జీవిస్తున్న ఆదివాసులే ముందుగా స్పందిస్తున్నారు. వాటిని ఆర్పేందుకు వారే కృషి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు