2021 కంటే ముందు వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం లేదు

23 Jul, 2020 09:16 IST|Sakshi

డబ్ల్యూహెచ్‌ఓ కీలక వ్యాఖ్యలు

జెనీవా: మహమ్మారి కరోనా వైరస్‌ను అంతం చేసే వ్యాక్సిన్‌ ప్రయోగ దశ ఫలితాలు సానుకూలంగా ఉన్నప్పటికీ.. 2021 కంటే ముందు పూర్తిస్థాయిలో టీకా అందుబాటులోకి వచ్చే  అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) పునరుద్ఘాటించింది. అదే విధంగా కోవిడ్‌-19 నిరోధక వ్యాక్సిన్‌ పంపిణీలో ఎలాంటి వివక్షకు తావు ఉండబోదని, అన్నింటి కంటే ముందు ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడమే ప్రధాన లక్ష్యమని పేర్కొంది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌ఓ ఎమర్జెన్సీ విభాగం అధిపతి మైక్‌ ర్యాన్‌ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి సంపద సృష్టి కోసమో, కేవలం పేదల కోసమో కాదని.. ప్రతీ ఒక్కరికి దాని అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచ మానవాళి మనుగుడ కోసం వ్యాక్సిన్‌ అత్యవసరమని.. కాబట్టి మహమ్మారిని కట్టడి చేయగల సమర్థవంతమైన టీకా అభివృద్ధి, ఉత్పత్తి పెంపునకై వివిధ సంస్థలతో కలిసి డబ్ల్యూహెచ్‌ఓ పనిచేస్తుందని తెలిపారు. (24 గంటల్లో 2.6 లక్షల మందికి)

‘‘వివిధ వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. మరికొన్ని మూడో దశ ప్రయోగాలకు చేరుకున్నాయి. అందులో ఏ ఒక్కటి విఫలం కాకపోవడం హర్షించదగ్గ విషయం. అయితే 2021 కంటే ముందు ప్రజలకు టీకా వేయడం సాధ్యపడకపోవచ్చు. వ్యాక్సిన్‌ పంపిణీలో ఎలాంటి తారతమ్యాలు ఉండబోవు’’అని మైక్‌ ర్యాన్ స్పష్టం చేశారు. కాగా ఫిజర్‌ ఐఎన్‌సీ, జర్మన్‌ బయోటెక్‌ బయోఎన్‌టెక్‌ తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ సురక్షితం, ప్రభావంతమైనదని నిరూపిస్తే 1.95 బిలియన్‌ డాలర్లు వెచ్చించి 100 మిలియన్‌ డోసులు కొనుగోలు చేస్తామంటూ అమెరికా ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇక అమెరికా తదితర దేశాల్లో పాఠశాలల పునఃప్రారంభం గురించి మైక్‌ మాట్లాడుతూ.. కోవిడ్‌-19 సామాజిక వ్యాప్తి నియంత్రణలోకి వచ్చేంత వరకు అటువంటి నిర్ణయం తీసుకోకపోవడమే మంచిదని పేర్కొన్నారు. (దోమలతో కరోనా రాదు)     

కాగా కోవిడ్‌-19ను కట్టడి చేసే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన.. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ కీలకమైన మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు చేరుకోగా.. అమెరికన్‌ కంపెనీ మోడెర్నా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ మూడో దశ మానవ ప్రయోగాలు ఈ నెల 27న మొదలు కానున్నాయి. అదే విధంగా రష్యాలోని సెషనోవ్‌ యూనివర్సిటీ (రష్యా) టీకా ఆగస్టు రెండోవారానికల్లా అందుబాటులోకి రానుందనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సైతం మానవ ప్రయోగాలు నిర్వహిస్తోంది.(అక్టోబర్‌–నవంబర్‌లో టీకా)

మరిన్ని వార్తలు