గాలి ద్వారా కరోనా.. !?

9 Jul, 2020 03:28 IST|Sakshi

వాదనల్ని కొట్టిపారేయలేమన్న డబ్ల్యూహెచ్‌ఓ

జనం రద్దీ ఉండే ప్రాంతాలు, ఇరుకు గదుల్లో వ్యాపించే చాన్స్‌

జెనీవా/ న్యూయార్క్‌: గాలి ద్వారా కరోనా వైరస్‌ వ్యాపిస్తుందని ఇప్పటివరకు ఎన్నో అధ్యయనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కొట్టిపారేస్తూ వచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తన స్వరం మార్చింది. వైరస్‌ గాలి ద్వారా వ్యాపించే అవకాశాలున్నాయనే వాదనల్ని పూర్తిగా కొట్టిపారేయలేమని స్పష్టం చేసింది. జనం రద్దీ ఉన్న ప్రాంతాల్లో, గాలి వెలుతురు లేని ప్రదేశాల్లో, ఇరుగ్గా ఉండే గదుల్లో గాలి ద్వారా వైరస్‌ వ్యాపించదని కచ్చితంగా చెప్పలేమని అంటోంది.

దీనిపై మరిన్ని బలమైన ఆధారాలను సేకరించి విశ్లేషించాల్సిన అవసరం ఉందంది. ఇటీవల 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తల బృందం కరోనా సూక్షా్మతి సూక్ష్మ క్రిములు (5 మైక్రాన్ల కంటే చిన్నవి) గాలిలో ఒక మీటర్‌ పరిధిలో విస్తరించి చాలా ఎక్కువ సేపు ఉంటాయని, ఆ గాలి పీల్చే వారికి వైరస్‌ సోకుతుందని డబ్ల్యూహెచ్‌ఓకి ఒక లేఖ రాశారు. ఈ మేరకు మార్గదర్శకాలను సవరించాలని వారు కోరారు. దీనిపై స్పందించిన ఆ సంస్థ టెక్నికల్‌ లీడ్‌ బెనెడెట్టా అలెగ్రాంజి గాలి ద్వారా వైరస్‌ వ్యాపించదని కచ్చితంగా చెప్పలేమని అన్నారు. అయితే ఇవన్నీ ప్రాథమిక ఆధారాలు మాత్రమేనన్నారు.

వైరస్‌ గాలిలో ఎంతసేపు ఉంటుందో, ఆ సమయంలో మరొకరికి సోకే అవకాశం ఎంతవరకు ఉందో ఇంకా స్పష్టంగా తెలియవలసి ఉందని చెప్పారు. ఒకవేళ గాలి ద్వారా వైరస్‌ వ్యాపించే అవకాశమే ఉంటే డబ్ల్యూహెచ్‌ఓ తన మార్గదర్శకాలను సవరించుకోవాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా అన్ని దేశాల ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటివరకు కోవిడ్‌ రోగి మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మి నప్పుడు నోటి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్‌ఒ చెబుతున్న విషయం తెలిసిందే.

ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?
ప్రపంచ దేశాలు, మరీ ముఖ్యంగా భారత్‌లో కోవిడ్‌ విజృంభిస్తున్న వేళ గాలి ద్వారా వైరస్‌ వ్యాపించే అవకాశాలను తోసిపుచ్చలేమని డబ్ల్యూహెచ్‌ఒ చేసిన ప్రకటన ప్రభుత్వం, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని చెబుతోంది. గాలి ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందని రుజువైతే మాస్కులు ధరించడం అత్యంత కీలకంగా మారుతుంది. ఇప్పటివరకు ఆస్పత్రిలో వైద్య సిబ్బంది ధరించే ఎన్‌–95 మాస్కులు సాధారణ ప్రజలు కూడా వాడాల్సిన అవసరం రావచ్చునని, జనం గుమిగూడే కార్యక్రమాల్ని పూర్తిగా రద్దు చేయాలని ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారు.

గాలి ద్వారా వ్యాపిస్తుందన్న అధ్యయనాలివే..
► వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తుందని మొదటిసారిగా నేచర్‌ పత్రిక ప్రచురించింది.  ఆస్పత్రిలో కారిడార్లలో కంటే చిన్న గదుల్లో, టాయిలెట్లలో గాల్లో వైరస్‌ ఎక్కువగా ఉన్నట్టు ఓ అధ్యయనంలో తేలిందని పేర్కొంది.
► అమెరికాలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌ (ఎన్‌ఈజేఎం) ఏప్రిల్‌లో నిర్వహించిన అధ్యయనంలో వైరస్‌ గాలిలో మూడు గంటల వరకు ఉంటుందని తేలింది.
► రోగులు మాట్లాడేటప్పుడు అత్యధికంగా తుంపర్లు బయటకు వస్తే గాల్లో ఎక్కువ సేపు వైరస్‌ ఉంటోందని యూఎస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ మేలో చేసిన అధ్యయనంలో తేలింది.

మరిన్ని వార్తలు