ఒక్కరోజులో 2.3 లక్షల కేసులు

14 Jul, 2020 03:29 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి

అమెరికాలో 66,000 కేసులు

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో రికార్డు స్థాయిలో అత్యధికంగా 2,30,000 కోవిడ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. వీటిలో 66,000 కేసులు ఒక్క అమెరికాలోనే నమోదయ్యాయి. గత మూడు రోజులుగా వరసగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ కేసులు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. ఒక్క శుక్రవారం రోజే 24 గంటల వ్యవదిలో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 2,28,000 కరోనా కేసులు రికార్డయ్యాయి.

ఐరోపా దేశాలను కమ్మేస్తోంది
తూర్పు ఐరోపా దేశాల్లో కరోనా జనాన్ని ఊపిరిసలపనివ్వడం లేదు. క్రొయేషియాలో మాస్క్‌ల వాడకం, హంగేరీలో ప్రయాణాలపై నిషేధం, క్వారంటైన్‌ వంటి చర్యలకు పూనుకుంటున్నారు. రొమేనియాలో ఆదివారం 456 కరోనా కేసులు నమోదయ్యాయి. సెర్బియాలో ఇప్పటి వరకు 18,000 మందికిపైగా కరోనా సోకగా, 382 మంది మరణించారు.

అమెరికాలో ఇప్పటి వరకు ఎక్కడా లేనంతగా ఫ్లోరిడాలో ఒకే ఒక్క రోజులో 15,299 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదవగా, 45 మరణాలు సంభవించినట్టు వైద్య విభాగం తెలిపింది. కాలిఫోర్నియాలో బుధవారం ఒక్కరోజులో 11,694 కేసులు నమోదవగా, న్యూయార్క్‌లో ఏప్రిల్‌ 15న ఒకేరోజులో అత్యధికంగా 11,571 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఫ్లోరిడా ఈ రికార్డుని బద్దలు కొట్టింది. ఫ్లోరిడాలో వారంలో సగటున రోజుకి 73 లెక్కన 514 మరణాలు సంభవించడం రికార్డు.

మరిన్ని వార్తలు